రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ గ్రామంలోని నీట్ పీజీ పరీక్షకు ఓ విద్యార్థి మద్యం మత్తులో హాజరైన ఘటన కలకలం సృష్టించింది. హైదరాబాద్కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఆదివారం 8గంటల సమయంలో శేరిగూడ సమీపంలోని నీట్ పరీక్ష కేంద్రానికి హాజరయ్యాడు. అతడి తీరుపై అనుమానం కలిగిన సిబ్బంది తనిఖీ చేయగా, అతడు మద్యం సేవించినట్టు నిర్ధారించారు. దీంతో సిబ్బంది పరీక్షకు అనుమతించలేదు. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, సిబ్బంది పకడ్బందీగా పరీక్షను నిర్వహించారు.
నీట్-పీజీకి 97.26 శాతం హాజరు
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 14 జిల్లాల్లోని 56 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన నీట్-పీజీ-2026 పరీక్షకు 97.26శాతం హాజరు నమోదైందని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 17,626 మంది హాజరు కావాల్సి ఉండగా, 17,143 మంది పరీక్షలు రాసినట్టు తెలిపారు. 483 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. కాగా, రీజినల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి దామోదర రాజనర్సింహ పరీక్షల నిర్వహణను పరిశీలించారు.