AP News : వైసీపీ అధినేత జగన్ మనస్తత్వంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ ఇద్దరు నేతలు కలిసి ప్రశాంతంగా ఉండటం జగన్కు అస్సలు ఇష్టం ఉండదని విమర్శించారు. జగన్ ప్రవర్తన చూస్తుంటే మహేశ్ బాబు ‘స్పైడర్’ సినిమాలోని విలన్ పాత్ర గుర్తుకొస్తోందని అన్నారు. సమాజంలో ఇబ్బందులు చూసి ఆనందించే సైకో విలన్ (ఎస్జే సూర్య క్యారెక్టర్) లా జగన్ ప్రవర్తన ఉన్నదని మండిపడ్డారు. కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే ఈ గొడ్డలి పార్టీ ఏకైక లక్ష్యమని తీవ్ర ఆరోపణలు చేశారు.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దగ్ధం కేసులో సీఐడీ దర్యాప్తు దాదాపు పూర్తి కావచ్చిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ భూములను, రికార్డులను మాయం చేసేందుకు అప్పట్లో జరిగిన ఈ భారీ కుట్రకు కారకులైన పెద్దల ముసుగులు త్వరలోనే తొలగిపోతాయని, బాధ్యులపై అత్యంత కఠినమైన లీగల్ చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. రాష్ట్రంలో త్వరలోనే అత్యంత పారదర్శకంగా ‘భూముల రీ సర్వే 2.0’ ప్రారంభించబోతున్నట్లు మంత్రి ప్రకటించారు.
వివాదాల్లో ఉన్న ప్రతి భూమిని లీగల్గా పరిష్కరించి రైతులకు భరోసా ఇస్తామన్నారు. ఏడాది కిందట జరిగిన దామినేడు భూ వ్యవహారాన్ని వైసీపీ నేతలు ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. తిరుపతిలో కూటమి నిర్వహించిన బహిరంగ సభ సూపర్ సక్సెస్ కావడంతో ఓర్వలేక తనపై, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అక్కడ భూములు కొనుగోలు చేసిన వ్యక్తికి తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. తమపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఇప్పటికే లీగల్ కేసులు పెట్టామని అన్నారు.