హైదరాబాద్, నవంబర్ 9: అమెరికాకు చెందిన కస్టమర్ ఎంగేజ్మెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ (24)7.ఏఐ హైదరాబాద్‌లో మరో 1,300 మంది ఉద్యోగులను పెంచుకునే దిశగా వెళ్తున్నది. ప్రస్తుతం ఇక్కడ కంపెనీకి 2,000 మంది ఉద్యోగులుండగా, వచ్చే ఏడాది మార్చికల్లా 2,500లకు, 2023 మార్చి నాటికి దాదాపు 3,300 మందికి పెంచుకోవాలని చూస్తున్నది. వచ్చే ఏడాదిన్నర కాలంలో చేపట్టే నియామకాల్లో వరంగల్, కరీంనగర్ వంటి నగరాల నుంచీ ఉద్యోగులను తీసుకుంటామని సంస్థ భారత్, అమెరికా విభాగం చీఫ్ డెలివరీ ఆఫీసర్ అనిమేశ్ జైన్ చెప్పారు. కాగా, 2003లో ఈ సంస్థ హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఉప్పల్‌లోని ఎన్ఎస్ఎల్ సెజ్‌లో (24)7.ఏఐ కేంద్రం ఉన్నది. టెలికం, రిటైల్, టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగాల్లోని ప్రముఖ సంస్థలకు సేల్స్, కస్టమర్ సర్వీస్, టెక్నాలజీ సహకారం మొదలగు చాట్-వాయిస్ ఆధారిత సేవలను (24)7.ఏఐ హైదరాబాద్ ఉద్యోగులు అందిస్తున్నారు.
లాక్డౌన్ ప్రకటించిన ఐదు రోజుల్లోనే ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం విధానంలోకి మళ్లించిన ఈ కంపెనీ.. తమ ఉద్యోగుల్లో 15 శాతం మందినే ఆఫీస్ నుంచి పని చేయిస్తున్నది. 85 శాతం మందిని ఇంకా వర్క్ ఫ్రం హోంకే పరిమితం చేసింది. అయితే వచ్చే ఏడాది, రెండేండ్లలో ఇది 30:70కి పెరుగవచ్చన్న సంకేతాలున్నాయి. గతేడాది అటు ఆదాయం, ఇటు నియామకాలపరంగా 25 శాతం వృద్ధిని చూసిన ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 17వేల మంది ఉద్యోగులున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌ల్లో 7,500 మందికిపైగా ఉన్నారు. ఇటీవలికాలంలో మహిళా ఉద్యోగులకూ సంస్థ ప్రాధాన్యత ఇస్తున్నది.