అమరావతి : ఏపీలో గడిచిన నాలుగు నెలలకాలంలో వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) ఆరోపించారు. విద్యా, వైద్యరంగాలను భ్రష్టుపట్టించారని విమర్శించారు. రేపల్లె నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో చంద్రబాబు (Chandra Babu) అబద్ధాలతో పోటీ పడలేకపోయామని అన్నారు.
అబద్ధాలు చెప్పినా ఈరోజు ప్రజల వద్దకు వెళ్లలేని పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు ( Pensions ) కట్ చేశారని దుయ్యబట్టారు. రెడ్‌బుక్ పాలన తీసుకొచ్చి ప్రజలను భయపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజానికం చంద్రబాబు మోసాలను గమనించి తిరుగబడుతున్నారని, రాబోయే రోజుల్లో ఆ పార్టీకి సింగిల్ డిజిట్ కూడా ఇవ్వరని జోస్యం చెప్పారు.
వైసీపీ హయాంలో లంచాలు లేకుండా పథకాలను అందించామని పేర్కొన్నారు. కష్టాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవని అన్నారు. విలువలు, విశ్వసనీయతే శ్రీరామరక్ష అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత వైసీపీకి దక్కుతుందని అన్నారు.