‘కథాంశాల పరంగా ఉన్న భాషాపరమైన హద్దులు తొలగిపోతున్నాయి. మంచి కథ, పాత్ర దొరికితే నేను తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తా’ అని అన్నారు శింబు. తమిళంలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా గుర్తింపును సొంతం చేసుకున్నారాయన. శింబు నటించిన తాజా చిత్రం ‘లూప్’. వెంకట్‌ప్రభు దర్శకుడు. సురేష్ నిర్మించారు. ఈ నెల 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో శింబు పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..
టైటిల్‌కు తగినట్లుగానే ఈ సినిమా ప్రచార చిత్రాలు వైవిధ్యంగా ఉన్నాయి? ఇది ప్రయోగాత్మక చిత్రం అనుకోవచ్చా?
‘సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. రాజకీయ చదరంగంలో ఓ సామాన్యుడికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అతడి జీవితంలో ఒకే సంఘటన మళ్లీ మళ్లీ ఎందుకు జరిగింది? తనపై పడిన ఓ నింద నుంచి అతడు ఎలా నిరపరాధిగా బయటపడ్డాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా కాదిది. కానీ ఇందులో చూపించిన అంశాలతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. రాజకీయస్వార్థం కోసం సామాన్యులను రాజకీయనాయకులు ఎలా పావులుగా వాడుకుంటారో ఇందులో చూపించాం. విభిన్నమైన ప్రయత్నంగా తెలుగు ప్రేక్షకులకు నవ్యానుభూతిని పంచుతుంది.
దర్శకుడు వెంకట్‌ప్రభు చెప్పిన కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేవి?
ఎస్జే సూర్య ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. టామ్ అండ్ జెర్రీ తరహాలో మా ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. కల్యాణి ప్రియదర్శినితో నా లవ్‌ట్రాక్ రెగ్యులర్ ప్రేమకథలతో పోలిస్తే వినూత్నంగా అనిపిస్తుంది. హీరో ఎదుర్కొనే సవాళ్లు కొత్తగా ఉంటాయి టైమ్‌లూప్ అనే పాయింట్‌ను అందరికి అర్థమయ్యే రీతిలో సింపుల్‌గా వెంకట్‌ప్రభు ఈ సినిమాలో చూపించారు. ఆయనతో చాలా కాలంగా పనిచేయాలన్న నా కల ఈ సినిమాతో తీరింది.
‘మన్మధ’తో తెలుగులో మీకు మంచి గుర్తింపు వచ్చింది? అయినా మీ సినిమాలు ఎక్కువగా తెలుగులో విడుదలకాలేదు?
కొత్తదనాన్ని ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారు. ప్రయోగాత్మకంగా భావించి ‘మన్మధ’ సినిమా చేశా. తమిళంలో పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగులో ఆ సినిమాను రీమేక్ చేయాలనుకున్నాం. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో నటించడానికి హీరోలెవరూ ముందుకు రాలేదు. దాంతో తెలుగులో ఆడుతుందనే నమ్మకంతో డబ్చేశాం. మా అంచనాలకు మించి సినిమా విజయాన్ని అందుకుంది. అదే నమ్మకం ఈ సినిమా విషయంలో ఉంది.
ఈ సినిమా కోసమే బరువు తగ్గి సన్నబడినట్లున్నారు?
కరోనా విరామంలో ఇరవై ఏడు కిలలో బరువు తగ్గా. ఈ సినిమాకు ముందు నా కెరీర్ బ్యాడ్‌ఫేజ్‌లో ఉంది. ఆ సంక్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మానసికంగా,ఆధ్యాత్మికంగా నా ఆలోచణ ధోరణిలో మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నా. అదే సమయంలో కరోనా కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో బరువు తగ్గడంపై దృష్టిపెట్టా. ప్రతి రోజు ఉదయం 4 గంటలకు లేచి వర్కవుట్స్ చేయడం మొదలుపెట్టా. దాదాపు ఇరవై ఏడు కిలోల తగ్గా. ఆల్కహాల్ తాగడం, నాన్‌వెజ్ తినడం మానేశాను. ఇప్పుడు చాలా కంఫర్ట్‌గా అనిపిస్తున్నది.
ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్నారు?
సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నా. అయినా ఏనాడు అధైర్యపడకుండా ఆ కష్టాలన్నింటిని చిరునవ్వుతో స్వీకరిస్తూ వచ్చాను. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మూడేళ్లు పట్టింది. ఎన్నో అడ్డంకులను దాటాం . పొలిటికల్ ఫిల్మ్ అని ప్రకటించడంతో కొన్ని రాజకీయపరమైన ఒత్తిళ్లు వచ్చాయి. నిర్మాణపరమైన కారణాలతో ఒకానొకదశలో సినిమా ఆగిపోయింది. ఆ కష్టాలన్నీ ప్రీ రిలీజ్ వేడుకలో గుర్తురాగానే కన్నీళ్లు ఆగలేదు. చాలా ఎమోషనల్ అయ్యాను.
పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు?
మంచి అమ్మాయిని వెతికిపెట్టండి. తప్పకుండా పెళ్లిచేసుకుంటా.
తదుపరి సినిమా విశేషాలేమిటి?
గౌతమ్‌మీనన్‌తో ‘వీటీకే’ అనే సినిమా చేస్తున్నా. మా ఇద్దరి కలయికలో వస్తోన్న మూడో చిత్రమిది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్నది. గౌతమ్‌కార్తిక్, నేను హీరోలుగా ‘పాథు తల’ అనే సినిమా తెరకెక్కనున్నది. తమిళనాడులోని ఫస్ట్ కరోనా పేషెంట్ కథతో ‘కరోనా కుమార్’ కామెడీ సినిమా చేస్తున్నా.