ప్రయాగ్‌రాజ్: భార్యకు ఆమె తల్లిదండ్రులు ఆర్థికంగా అండగా ఉన్నంత మాత్రాన, ఆమెకు భరణం చెల్లించాల్సిన బాధ్యత నుంచి భర్త తప్పించుకోలేడని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. బులంద్‌షహర్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఒక మహిళ, ఆమె ఇద్దరు మైనర్ పిల్లలు దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఫ్యామిలీ కోర్టు 2023లో భార్యకు భరణం పొందే అర్హత లేదంటూ ఆమె అభ్యర్థనను తిరస్కరించింది.
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గరిమా ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుట్టింటివారు ఆర్థిక సహాయం అందిస్తున్నారనే కారణంతో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 కింద భర్త నుంచి భరణం పొందే హక్కును భార్యకు నిరాకరించలేరని పేర్కొన్నారు.