Akhanda 2 | నందమూరి బాలయ్య అభిమానులు ఆయన నటించిన అఖండ 2 చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దసరా సందర్భంగా పోస్టర్ విడుదల చేస్తూ అఖండ 2ని డిసెంబర్ 5న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఇన్నాళ్లు అందరిలో ఉన్న అనుమానాలకి చెక్ పడింది . మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2’ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇతర సినిమాల పోటీ కారణంగా ముందుగా అనుకున్న సెప్టెంబర్ 25 విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా అన్ని పనులు పూర్తి చేసుకుని డిసెంబర్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది ఈ మాస్ మసాలా చిత్రం.
‘అఖండ’కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సనాతన ధర్మాన్ని కాపాడే అంశంతో రూపొందుతోంది. ఓ వైపు భక్తి, ఆధ్యాత్మికతను, మరోవైపు మాస్ యాక్షన్‌ను సమపాళ్లలో చూపించబోతున్నామని బోయపాటి శ్రీను తెలిపారు. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ షేడ్స్‌లో కనిపించనున్నట్లు సమాచారం. మాస్ లుక్‌తో పాటు తత్త్వచింతనతో కూడిన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్ముతున్నారు. ‘అఖండ 2’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ భారీగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బాలకృష్ణ కెరీర్లో తొలిసారి ఓ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుండటం విశేషం.
హిందీ వెర్షన్ డబ్బింగ్ పూర్తయ్యిందని ఇప్పటికే బాలయ్య క్లారిటీ ఇచ్చారు. హిందీ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా కనెక్ట్ అయ్యేలా చేసామని దర్శకుడు చెప్పాడు. సంయుక్త మీనన్ హీరోయిన్గా ఈ చిత్రంలో నటిస్తుంది. ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అఖండ తో బాలయ్య-బోయపాటి కాంబినేషన్ మాస్ ఆడియెన్స్‌ను ఊపేసింది. ఇప్పుడు దానికన్నా ఎక్కువగా ‘అఖండ 2’పై అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న థియేటర్లలో బాలయ్య విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ట్రైలర్, సాంగ్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.