Ajay Devgn | బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘దే దే ప్యార్ దే 2’ ప్రస్తుతం చర్చలో నిలిచింది. 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన దే దే ప్యార్ దే సినిమాకి ఇది సీక్వెల్. రొమాంటిక్ డ్రామా జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు రెండు పాటలు విడుదల కాగా, తాజాగా మూడో పాట ‘3 షౌక్’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే పాటల కంటే ఎక్కువగా ఈ సీక్వెల్ పై సోషల్ మీడియాలో మరో చర్చ నడుస్తోంది. కారణం అజయ్ దేవగణ్ తక్కువగా కనిపించడం, మరో నటుడు మీజాన్ జాఫ్రీ ఎక్కువగా హైలైట్ కావడం. ఇప్పటికే విడుదలైన రెండు పాటల్లోను, ఇప్పుడు కొత్తగా వచ్చిన 3 షౌక్ సాంగ్లోను మీజాన్ జాఫ్రీనే ప్రధానంగా చూపించారని అభిమానులు విమర్శిస్తున్నారు.
తాజాగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లో మీజాన్ జాఫ్రీ రెండు కార్లపై ఐకానిక్ పోజ్‌లో కనిపించగా, అజయ్ దేవగణ్ మాత్రం కనిపించకపోవడం అభిమానుల్లో అసంతృప్తిని రేకెత్తించింది. “సొంత ఫ్రాంచైజీలో అజయ్‌కే తక్కువ ప్రాముఖ్యత ఎందుకు?” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు.కొంతమంది ఫ్యాన్స్ అయితే ఈ పరిస్థితి ఔరాన్ మే కహాన్ దమ్ థా సినిమా పరిస్థితిలానే మారుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ చిత్రంలో కూడా అజయ్ దేవగణ్ ఎక్కువగా హైలైట్ కాకపోవడంతో ఫలితం నిరాశపరిచిందని గుర్తు చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఇది దర్శకుల ప్లాన్ అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
కథలో మీజాన్ జాఫ్రీ పాత్ర కీలక మలుపు తిప్పుతుందనే అంచనాలు ఉన్నాయి. కథ ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి అజయ్ దేవగణ్ వయస్సు ఎక్కువగా ఉండటంతో పెళ్లికి ఒప్పుకోక, మీజాన్ పాత్రను పరిచయం చేస్తాడని సమాచారం.కాబట్టి మీజాన్ జాఫ్రీని హైలైట్ చేయడం కథా నేపథ్యంలో భాగం కావొచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా, సోషల్ మీడియాలో ఈ వివాదం సినిమాపై భారీ హైప్ తీసుకువచ్చింది. వివాదాల మధ్య ‘దే దే ప్యార్ దే 2’ చిత్రం ఈ ఏడాది నవంబర్ 14న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.