అడవి పువ్వు
నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.25000 బహుమతి పొందిన కథ.
నల్లని మేఘాలు సూర్యుణ్ని కొంగులో దాచేసిన కాసేపటికే.. ఆకాశానికి చిల్లులు పడ్డట్టు జోరువాన మొదలైంది. తోడుకోసం ఈదురు గాలుల్ని వెంట తీసుకుని వచ్చింది. ప్రాణంగా పెంచుకున్న మొక్కలు, ఈదురుగాలులకు తలలు వాల్చేస్తుంటే.. కుండీలను వాన తగలని చోటికి భద్రంగా మార్చడానికి వానలో అడుగుపెట్టింది వినోదిని. అప్పుడు చూసిందా పిల్లను. గుబురుగా పెరిగిన పారిజాతం మానును ఆనుకుని, ముడుచుకుని కూర్చుంది. మోకాళ్ల వరకూ ఉన్న గౌనులో.. ఎవ్వరూ పట్టించుకోని మురికి గోడలా ఉంది. చేతిలో ఆమెకన్నా పెద్దగా ఉన్న ఒక ప్లాస్టిక్ సంచి, దాన్నిండా పాత సామాన్లు, చిత్తు కాగితాలతో.. వెలిగిపోతున్న భారతావనికి నిలువుటద్దంలా ఉంది. భయం భయంగా చూస్తున్న ఆ చిన్నారి గాజు కళ్లు.. ఒక్క చీత్కారానికే పగిలిపోయేలా ఉన్నాయి. వర్షానికి తడిచి పోతాయేమో అనే భయంతో చిత్తు కాగితాలను పచ్చనోట్ల కట్టల్లా భద్రంగా దగ్గరికి లాక్కుని.. వినోదినిని చూడగానే లేచి నిల్చుంది.
జల్లులకు వణికిపోతున్న ఆ లేతశరీరాన్ని చూసి వినోదిని మనసు ఆర్ధ్రమయ్యింది
“నీ పేరేంటి పాపా?”.. ప్రేమగా అడిగింది వినోదిని.
“బంతి”.. పువ్వులా పలికిందా పిల్ల.
“లోనికి రా! వర్షం తగ్గాక వెళ్దువు గానీ”..
వినోదిని మాటలు బంతికి చిత్రంగా అనిపించాయి. ఇప్పటివరకూ అందరూ ఆమె కనిపిస్తే కేకలేసి, తరిమేసే వారే కానీ.. ఇంత ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించేవారు కూడా ఉంటారా! అన్నట్టు చూస్తూ నిల్చుంది.
ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్లి, ట్యూషన్ పిల్లల పక్కన కూర్చోబెట్టింది వినోదిని. పిల్లలు ఓ నిమిషం విచిత్రంగా చూసి, వాళ్ల చదువులో పడిపోయారు. ఆ పిల్లల్ని, వారి చేతిలోని పుస్తకాలను అబ్బురంగా చూస్తూ.. గోడవారగా బుద్ధిగా కూర్చుంది బంతి. దానికీ చదువుకోవాలని ఉంది. ఆ పిల్లల్లా పెన్నుతో కొత్త పుస్తకాల్లో రాయాలని ఉంది. రెండో క్లాసు వరకూ చదివింది. దురదృష్టం నీడలా చుట్టేసి, దాని తండ్రిని తీసుకుపోయింది. కాబట్టే చదువు ఆగిపోయింది. లెక్కలంటే మహాఇష్టం. ఏరి తెచ్చిన చిత్తు కాగితాలకు ఇవ్వాల్సిన సొమ్ములను అది నోటితోనే లెక్కేసినప్పుడు.. షావుకారు మెచ్చుకుంటే తెగ పొంగిపోయేది. దాని చెల్లెలు రామిని స్కూలుకు పంపిస్తున్నది. తమ్ముడు పసివాడు. వాడికి రోజూ పాలు కొంటున్నది. తల్లి సంపాదించే నాలుగు రాళ్లకు.. ఇంకో రాయి తెచ్చిపెడుతున్నది. పదేళ్లకే పెద్దరికాన్ని నెత్తిన మోస్తున్నది.
“ఏడ్నుండి వచ్చావే గుంట? ఇల్లంతా మురికి చేసినావ్ కదటే!”.. కేకలు వేస్తూ హాలులోకి వచ్చింది అనసూయమ్మ.
బంతి గుండె జారిపోయింది. సగం తడిచిన బట్టల్తో వినోదిని వైపు బిత్తర చూపులు చూస్తూ.. కళ్లల్లో నీళ్లు కుక్కుకుని నిల్చుండి పోయింది. ఆమె మసిబారిన అడుగులు తెల్లని గచ్చు మీద మరకలు చెయ్యగా, వాటిని గమనించి వెంటనే చేత్తో రుద్దుతూ శుభ్రం చేసింది బంతి.
“వర్షంలో తడుస్తూ ఉంటేనూ! నేనే లోనికి తీసుకు వచ్చానత్తమ్మా!” వినోదిని సంజాయిషీ ఇచ్చింది.
పిల్లల ముందు ఏదైనా మాట జారితే అత్తాకోడళ్ల తగువులు బజారున పడతాయని అనసూయమ్మ మౌనంగా ఉండిపోయింది. కానీ, వినోదిని చేసిన పని ఏ మాత్రం నచ్చలేదామెకు. కళ్లతోనే బంతిని చంపేసేట్టు కొరకొరా చూస్తుంటే.. వానజోరు ఊపందుకున్నా లెక్క చేయకుండా తన సంచి తీసుకుని పారిపోయింది బంతి. తను వెళ్లినవైపే చూస్తూ ఉండిపోయింది వినోదిని.
ఆ రోజు మొదలు బంతి అక్కడికి వస్తూ పోతూ ఉండేది. గేటు దగ్గర నిల్చుని లోపలికి తొంగి చూసేది. పారిజాతం నీడలో రాలిన పువ్వులను ఒక్కోటి ఏరుకునేది. వినోదిని కనిపించగానే చిరునవ్వుతో పలకరించేది. కాసేపు ఆవరణలోనే తచ్చాడుతూ వెళ్లిపోయేది. వినోదిని లోపలికి రమ్మని పిలిచినా.. గేటు దాటి వచ్చేది కాదు.
మార్కెట్ వీధిలో మురికి కాలువ పక్కన వెలసిన గుడిసెల దగ్గర ఆడుకుంటూ ఉండే బంతిని, అటుగా వెళ్లినప్పుడు చూసిన వినోదిని మనసు తరుక్కుపోయింది. ఏ ధనవంతుడు విసిరేసిన స్వర్ణ పుష్పమో.. ఈ అభాగ్యులకు దొరికి అశ్రద్ధతో మసిబారినట్టున్న బంతిని చూసినప్పుడల్లా, ఆ తెల్లని మురికి శరీరాన్ని సున్నిపిండితో స్నానం చేయించి, ముద్దబంతి పువ్వులా తయారు చేయాలని అనిపించేది ఆమెకు. కళ్లతోనే కోటి భావాలను పలికించే ఆ గాజుకళ్ల పిల్లను ఒడిలో కూర్చోబెట్టుకుని ఓనమాలు దిద్దించాలని కూడా ఆమెకు ఆశగా ఉండేది.
నిజానికి వినోదినికి ఎన్నో ఆశలు. ఒక ప్రైవేటు
టీచర్‌గా పగలంతా పాఠాలు చెప్పి అలసిపోయి ఇంటికి వచ్చాక, వెచ్చని సాయంత్రాలు ఆరు బయట వెన్నెల్లో బొండు మల్లెలతో కులాసాగా ముచ్చట్లు చెప్పుకోవాలని, చెట్ల సందుల్లో నిల్చుని సముద్ర పక్షులు పాడే అరుదైన రాగాలను ఆలకించాలని, మేడమీద ఒక పల్చటి చాప మీద తనూ శేఖర్ కలిసి చల్లని చిరుగాలులతో సేదదీరాలని, తమ పిల్లలు పెద్దవాళ్లవ్వకుండా ఇంకా తన ఒడిలోనే ఆడుకోవాలని.. ఎన్నో ఆశలు. అన్నీ అందనివే!
శేఖర్ బ్యాంక్ ఉద్యోగి. రోజంతా డబ్బుతోనే సహవాసం చేసీచేసీ కాబోలు.. డబ్బే లోకంగా మారిపోయింది అతనికి. సాయంత్రాలు వృథాకాకుండా వినోదినితో కాలనీ పిల్లలకు ట్యూషన్లు మొదలు పెట్టించాడు. మొదట్లో ట్యూషన్లు చెప్పడానికి విసుక్కున్నా, వాటితో వస్తున్న ఆ ఇంత డబ్బు కొత్తగా తీసుకున్న కారు లోను తీర్చడానికి సరిపోవడంతో.. సాయంత్రాలు తన తీరని ఆశల్ని మర్చిపోయింది వినోదిని.
* * *
తన కూతురుకు పొట్టిదైన ఒక గౌనును బంతికోసం తీసిపెట్టింది వినోదిని. అక్కడక్కడా చినుగులతో, పాత మురికి గౌనులో కనిపించే బంతి.. ఈ గౌను చూస్తే ఎగిరి గంతేస్తుందా! వీధిలో ఒక దయగల అమ్మగారు తనను పిలిచి మరీ బట్టలిచ్చారని తన వాడలోని పిల్లలందరికీ చూపించుకుంటుందా! వినోదిని ఇవేవీ ఆలోచించలేదు. బంతిని ఈ గౌనులో ఊహించుకుని మురిసిపోయింది.
వినోదినికి పువ్వులంటే ఇష్టం. పువ్వులాంటి బంతి మీద కూడా రోజురోజుకూ ఇష్టం పెరిగిపోతున్నదామెకు. ఆ సాయంత్రం బంతి కోసం గేటు దగ్గర వేచి చూస్తూ నిల్చుంది. బంతి రాగానే ఆమె మొహం విప్పారింది. లోనికి రమ్మని పిలిచింది. బంతి గేటు దాటి గుమ్మం వరకూ వచ్చిందే కానీ.. ఇంట్లోకి మాత్రం రాలేదు. క్రితంసారి జరిగిన అవమానం ఆ పసిదాని కళ్లల్లో ఇంకా మిగిలే ఉంది. లేత ప్రాయమే అయినా బంతికి ఆత్మాభిమానం ఎక్కువ. ఎవ్వరితో ఒక్కమాట అనిపించుకునేది కాదు. వినోదిని ఇచ్చిన గౌను తీసుకోడానికి మొదట ఇష్టపడలేదు బంతి. బలవంతం మీద తీసుకుంది.
“రేపు శుభ్రంగా స్నానం చేసి ఈ బట్టలేసుకోవే! ముత్యంలా మెరిసిపోతావు”..
చిత్తు కాగితాలు ఏరుకునే ఈ పిల్ల మీద ఎందుకింత అభిమానమో వినోదినికి తెలియదు. బంతికీ అర్థం కాలేదు.
ఆమె ఇచ్చిన గౌనును అభావంగా తీసుకుని వెళ్లిపోయింది. రేపటి సాయంత్రం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూసింది వినోదిని. రోజూ తోటలోని గులాబీలను పలకరించినట్టు, బంతిని చూడటం వినోదినికో వ్యాపకం. పాలుకారే పసి వయసులో కుటుంబ భారాన్ని మోసే ఆ పిల్లలో గోవర్ధన గిరిని మోసిన చిన్ని కృష్ణుడు కనిపిస్తాడామెకు.
సాయంత్రం గేటు దగ్గర నిలబడింది బంతి. అదే మురికి పట్టిన గౌనులో, పాత కాగితాల మూటతో ప్రత్యక్షమైంది. వినోదిని మనసు చివుక్కుమన్నది. తానిచ్చిన గౌనులో బంతిని చూడాలని అనుకున్న ఆమె మనసు నిరాశ పడింది.
“గౌను ఎందుకేసుకోలేదు బంతి?”.
“మరేమోనండీ.. రేపు మా సెల్లి పుట్టిన దినమండీ. దానికొక్క బట్టా లేదండీ! అందుకే దానికా గౌనిస్తే తెగ సంబరపడి పోయిందండీ”.
“సరేలే! నీకింకో గౌనిస్తాలే!”.
“వద్దండీ”.
“ఎందుకే!?”.
“వద్దండీ.. మరేమో నాను కొత్త గౌనేసుకుంటే, మా పేటలోని నా ప్రెండ్సందరూ వాళ్లకు లేదని బాధ పడతారండీ. గౌను కోసం ఆళ్లమ్మల్నీ అయ్యల్నీ పీక్కు తింటారండీ. నాకొద్దండీ”.
ఒకరికి కొంటే ఇంకొకరికి కొనలేదని అలిగి కూర్చునే తన పిల్లలు గుర్తుకువచ్చారు వినోదినికి.
“సరే! నీ పేటలోని పిల్లలందరికీ గౌన్లు ఇస్తాలే!”.. మాట ఇచ్చింది.
“నిజమాండీ!”.. బంతి కళ్లు విప్పారాయి.
చెప్పినట్టుగానే బట్టలు పంచడానికి పేటకు వెళ్లింది. తన స్కూల్ పిల్లలను పాత బట్టలు ఇవ్వమ్మని అడగ్గానే.. వందల కొద్దీ బట్టలు పోగయ్యాయి. వాటిని పేటలో పంచడానికి కొందరు పిల్లలతోపాటు వెళ్లింది వినోదిని.
బతుకు తెరువు కోసం ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చిన పక్షుల్లాంటి పేట జనాలు వారి చుట్టూ గుమిగూడారు. వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.
బంతి కుటుంబానికీ ఓ కథ ఉంది. అడవిలో బతికిన అడవి బిడ్డలు. కొండల్ని చదును చేసి, పోడు వ్యవసాయం చేస్తూ, దుంపల్ని కాయల్ని తింటూ బతికేవారు. వేటకుపోయి అడవి పందుల్ని, పురిటి పిట్టల్ని వేటాడే సంచార జీవులు. నీటికి కొదవలేదు. తిండికి తిప్పలు లేదు. ప్రకృతి ఒడిలో ఆనందంగా బతుకుతున్న వీళ్లపై ఏ దేవునికో కన్నుకుట్టింది. ప్రభుత్వం ఇచ్చిన భూములు కరువు కాలంలో చేసిన అప్పులకు కొట్టుకుపోగా.. అడవిలో ఇప్పకల్లు స్థానాన్ని ఆక్రమించిన నాటుసారా.. బంతి తండ్రిని చితిలో పడేసింది. ముగ్గురు పిల్లలతో బంతి తల్లి ముత్యాలు ఒంటరైంది. గుడిసె అద్దెకు తీసుకుని ఈ పేటకు వచ్చింది. చదువుల తల్లి బంతి చదువు రెండో తరగతికే ఆగిపోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ బతుకుల్లో పదేళ్లకే పనికి పోయి వెలుగు దీపమైంది. వీధిలో చిత్తు కాగితమే దానికి పచ్చనోటైంది.
వినోదినిని చూడగానే బంతి పరిగెత్తుకు వచ్చింది. పేట పిల్లలూ వరస కట్టారు. పేదరికానికి బట్టలు తొడిగినట్టున్న ఆ పిల్లల్ని చూసి, వినోదిని మనసు బాధగా మూలిగింది. బట్టల్ని పంచిపెట్టిందే కానీ.. ఆమె మనసు ఇంకేదో చెయ్యాలని ఆరాట పడింది. కానీ, ఏం చెయ్యగలదు? అందరిలాగే ఈ అభాగ్యుల కోసం జాలి చూపులను విసరడం తప్ప!
వెలిగిపోతున్న మొహంతో ఒక్కో పిల్లకు బట్టలు పంచిపెడుతుంటే పేటలో పండగొచ్చినట్టు అయ్యింది. పిల్లలందరూ బట్టలు తీసుకుని మురిసిపోయారు. బంతి కోసం ఎర్ర గౌను ఎంచి పెట్టి ఇచ్చింది వినోదిని.
* * *
ఏదో ఉపద్రవాన్ని మోసుకొస్తున్నట్టు, ఆకాశం నిండా నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. వర్షంలో కారు తడిసిపోకుండా, కవరు కప్పడానికి బయటికి వెళ్లిన వినోదిని.. అక్కడి దృశ్యం చూసి హతాశురాలైంది.
బంతి.. తమ కారు మీద వేళ్లతో గీతలు గీస్తూ ఉండేసరికి, ఒక్కసారిగా వినోదానికి పట్టరాని కోపం ముంచుకువచ్చింది. బంతి చెంపపై ఒక్కటి చరిచింది. ఈ హఠాత్పరిణామానికి బెంబేలెత్తి.. తెల్లబోయి నిల్చుంది బంతి.
సాయంత్రాలు ట్యూషన్లు చెప్పి లోను తీరుస్తున్న కారు. తన ఆశల్ని – కలల్ని ధారబోసి కొనుక్కున్న కారు. తమ మధ్యతరగతి బతుకుల హోదాను పెంచిన కారుపై అసహ్యంగా లోతైన గీతలు. బలమైన గోర్లతో చెక్కినట్టున్న గీతలు. ఎర్రని కారుపై స్పష్టంగా కనిపిస్తున్నాయి.
“ఎందుకే కారు మీద గీతలు గీసావ్?” గొంతు పగిలిపోయేలా అరిచింది వినోదిని.
బంతి తెల్లమొహం వేసింది.
“చెప్పు! కారునెందుకు నాశనం చేసావ్?” పిల్ల జబ్బ పట్టుకుని రెట్టించి అడిగింది.
“నాను గియ్యలేదు” గట్టిగా చెప్పింది బంతి.
దాని కళ్లల్లో నీళ్లు ఉగ్గబెట్టుకుని నిల్చుంది.
“అబద్ధం ఆడకు!”.. ఇంకో చెంప వాయించింది వినోదిని.
అప్పటికే గొడవకు అక్కడికి చేరిన అనసూయమ్మ ఆమెను వెనక్కి లాగింది.
“నాను గియ్యలేదంతే!”.. భూమి అదిరిపడేలా ఏడుస్తూ వినోదిని నుంచి చెయ్యి విడిపించుకుని పారిపోయింది బంతి.
తనలో భావుకత ఎప్పుడు ఎండిపోయిందో వినోదిని గమనించనే లేదు. బంతి వెళ్లినవైపే చూస్తూ నిల్చుంది. ఆమె చెక్కిళ్లపై కన్నీరు కాల్వలు కట్టాయి.
“చూస్తుంటే ఆ పిల్ల గీసినట్టు లేదు విన్నూ!”.. అనసూయమ్మ కారును పరీక్షిస్తూ చెప్పింది.
అంత లోతైన గీతలు, అక్కడక్కడా పడిన సొట్టలు చిన్నపిల్ల చేసినట్టు లేదు. వినోదిని కూడా పరీక్షించి చూసింది. నిజమే! ఆ అసహ్యమైన, బలమైన గీతలు బంతి చేసుండదు. మరి తన కళ్లు తనను మోసం చేశాయా? తను చూస్తుండగానే కదా బంతి కారు మీద గీతలు గీస్తూ ఉంది. ఆలోచనలో పడింది వినోదిని. అనుమానం తీరడానికి సీసీ కెమెరాలో చూసింది.
కారు మీద ఒక వీధి కుక్క మూత్రం పొయ్యడంతో, ఇంకొన్ని కుక్కలు ఆ వాసనకు రెచ్చిపోయి కారు మీద దాడి చేస్తూ ఉంటే.. అటుగా వచ్చిన బంతి వాటిని తరిమేసింది. కారు మీద పడ్డ గీతలను తన గౌనుతో శుభ్రం చేస్తుంటే, తప్పుగా భావించిన వినోదిని కోపంతో కళ్లు మూసుకుపోయి బంతి చెంప చెళ్లుమనిపించింది.
ఇంతకీ ఏ అధికారంతో కొట్టింది? బట్టలు ఇచ్చింది కదా! ఆ అధికారం కొట్టే హక్కు మోసుకు వచ్చిందా?
అదే పక్కింటి పిల్లవాడో, ట్యూషన్‌కు వచ్చే గొప్పింటి పిల్లలో ఇలా చేసుంటే కొట్టేదా? ఊహూ.. అస్సలు కొట్టదు. బంతి అభాగ్యురాలు కాబట్టి చులకన. బంతిని కొడితే నిలదీసేవారు లేరు కాబట్టి ఈ ధైర్యం. వినోదిని మనసు కూలిపోయింది. ఎప్పుడూ నోరు పారేసుకునే అనసూయమ్మ కూడా కొట్టలేదు. మరి తనేం చేసింది. అభం శుభం తెలియని పిల్లను కొట్టింది. ఆమె మనసుకు కమ్మిన ఒక్కో పొర తొలగిపోతుంటే, పశ్చాత్తాపంతో కన్నీటి నదులు సముద్రానికి దారి తీశాయి.
బంతి కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూసింది వినోదిని. జరిగిన తప్పునకు, దాన్ని ఒడిలోకి తీసుకుని ప్రేమగా మన్నించమని కోరాలని ఆశపడింది. రెండు రోజులు గడిచాయి. బంతి రాలేదు. బంతివాళ్ల పేటకు వెళ్లి ఆరా తీయగా, రెండు రోజుల నుంచీ జ్వరం పట్టిన బంతిని, ఆసుపత్రిలో వేశారని తెలిసి, వంద లంకణాలు చేసినట్టు నిస్సత్తువ ఆవహించిందామెకు. ఒకవేళ తన మూలానే బంతి ఆసుపత్రి పాలవ్వలేదు కదా! అనుకుంటూ.. బంతిని కాపాడమని వంద దేవుళ్లను మొక్కుకుంటూ ఆసుపత్రికి చేరుకున్నది.
దేశంలోని రోగులంతా ఇక్కడే ఉన్నారేమో అనేంత జనాల్ని చూస్తూ బంతి కోసం వెతికింది వినోదిని.
ఓ మూలన మంచానికి అతుక్కుని ఉన్న బంతిని చూసి ఆతృతగా ఆమె దగ్గరికి వెళ్లింది.
“అమ్మగోరు!”.. నీరసంగా చూసింది బంతి.
ఆమె పక్కన కూర్చున్న ముత్యాలు లేచి వినోదినిని కళ్లతోనే పలకరించింది.
“అడవి బిడ్డలమమ్మా! చెట్టూ పుట్టలను నమ్ముకుని బతకడం తప్పా.. యేటీ తెలీదు. జూకర దేవతకు మేమేం దోసం చేసేసినామో.. ఈడికొచ్చి పడ్డాం! తాగి తాగి నా మొగుడు సచ్చిపోనాడు. పిల్లల్తోని నేను ఒంటిదాన్ని అయిపోనాను”.. ముత్యాలు కన్నీళ్లు పెట్టుకుంది.
“దీనికి సదువుకోడమంటే మా సెడ్డ ఇట్టం. ‘అమ్మగోరు ఎంత బాగా సదువు సెప్తారో! నన్నూ పంపీవే!’ అని పానాలు తోడేసేది. ఈది బడిలో ఏద్దామన్నా.. ఇదెళ్లిపోతే సొమ్ములు తెచ్చేదెవరు? నానూ అదీ కలసి కట్టపడితేనే దినం ఎల్లుతంది. అందుకనే గాదేటి.. దాన్ని పనికి పంపిస్తున్న. ఈ యేల ఏ చెత్త కుప్పకాడ అంటించుకొచ్చిందో ఈ మాయదారి రోగం!”..
చీర కొంగుతో కళ్లొత్తుకుంటూ చెప్పింది.
గేటుకు తగిలించిన ‘ట్యూషన్ చెప్పబడును’ అనే బోర్డును ప్రేమగా తాకుతూ, బయట నిల్చుని ట్యూషన్ పిల్లలను ఆసక్తిగా తొంగి చూసే బంతి.. గుర్తుకు వచ్చింది వినోదినికి. ఆమె మనసు బాధతో మూలిగింది.
అస్థిపంజరానికి గుడ్డలు కప్పినట్టున్న బంతి మొహంలోకి చూడాలంటేనే సిగ్గుగా ఉందామెకు. తినగా మిగిలిన వంటలు, వాడగా పాతబడ్డ బట్టలు, చిత్తు కాగితాలు.. బంతికోసం దాచి పెట్టిందే కానీ, దాని బతుకును వెలిగించే చదువును అందివ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. చదువు వ్యాపారం అయినప్పుడు ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది?
ప్లేట్లెట్స్ పడిపోవడంతో సగం చిక్కిపోయింది బంతి. శరీరం మీద నీలిరంగు మచ్చలు తేలాయి. తీవ్రమైన అలసటతో మత్తుగా మూలుగుతున్న బంతి.. ఏదో చెప్పాలని సైగ చేయడంతో, దగ్గరగా వెళ్లింది వినోదిని.
“నేనా గీతలు గియ్యలేదండీ!” బంతి గొంతు బొంగురు పోయింది.
వినోదినికి గుండె గొంతులోకి వచ్చింది. బంతిని క్షమాపణలు అడగడానికి అహం అడ్డొచ్చి, దాని నుదిటి పైన ముద్దుపెడుతూ కన్నీటితో కడిగింది. బంతి మత్తులోకి జారిపోయింది. అన్ని దెబ్బలు కొట్టినా తనవారితో చెప్పని బంతి మీద అభిమానం పొంగుకొచ్చింది.
“తొందరగా కోలుకోమ్మా.. నిన్ను నేను చదివిస్తా!” బంతి చెవిలో గద్గదంగా చెప్పింది వినోదిని.
బంతి పేలవంగా నవ్వినట్టు అనిపించిందా క్షణాన. ఆ నవ్వు చెక్కు చెదరకుండా అదేరాత్రి కనుమరుగై పోయింది. ముత్యాలు రోదనలు ఆకాశాన్ని తాకాయి.
ఏనాటి బంధమో ఇలా దగ్గరైంది. అంతలోనే తిరిగిరాని లోకాలకు పయనమైంది. బంతి వెళ్లిపోయింది. అందరికీ సమానంగా బతికే హక్కులేని ఈ ప్రపంచం నుంచి.. వేరే ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోయింది.
* * *
కాలం.. వరద ఉధృతికి ఉప్పొంగిన నదిలా వేగంగా సాగిపోతూ ఉంది. ఒకప్పటిలా బంతి కోసం సాయంత్రాలు ఎదురు చూడటం లేదు వినోదిని. బంతి చెల్లెలు రామీ.. బంతిలా గేటు దగ్గర తచ్చాడటం లేదు. గేటు దాటి లోపలికి వచ్చి వినోదిని దగ్గర సాయంత్రపు పాఠాలు నేర్చుకుంటున్నది.
‘ఇక్కడ ఉచితంగా చదువు చెప్పబడును’ అనే బోర్డు వినోదిని ఇంటి గేటుకు కొత్త సొగసులు అద్దింది..
కిరణ్ విభావరి: 90305 86754
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

