హల్ (బ్రిటన్): కరోనా వైరస్ మన శ్వాస వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుందన్న విషయం చాలా మందికి తెలిసిందే. కానీ, ఈ మహమ్మారి మన జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుందట. కొవిడ్‌తో బాధపడుతున్న వారిలో చాలా మంది ‘బ్రెయిన్ ఫాగ్’ అనే దృగ్విషయాన్ని అనుభవిస్తారని, దీని వల్ల వారిలో తాత్కాలికంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సన్నగిల్లడం, రోజువారీ పనులను సరిగా గుర్తుపెట్టుకోలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయని ఓ అధ్యయనం తేల్చింది.
బ్రెయిన్‌ఫాగ్ అనేది దీర్ఘకాలిక కొవిడ్ వ్యాధి లక్షణమని, దీని బారిన పడినవారు నెలలు లేదా సంవత్సరాల పాటు కొవిడ్ లక్షణాలతో బాధపడుతుంటారని ఆ అధ్యయనం పేర్కొన్నది. జ్ఞాపకశక్తిపై కొవిడ్ ప్రతికూల ప్రభావం చూపుతుందని, అయితే 25 ఏండ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వయోజనుల్లో ఇలా జరుగుతుందని గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొవిడ్ బాధితుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మళ్లీ జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని, అయితే కొవిడ్ లక్షణాలతో దీర్ఘకాలం బాధపడేవారిలో మాత్రం జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్య లు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు.