Actress | సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ క్యాస్టింగ్ ఆర్టిస్ట్ తనతో అనుచితంగా ప్రవర్తించాడంటూ ఓ సినీ నటి పోలీసులను ఆశ్రయించిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సినిమా రంగంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఓ నటికి ‘ఆకాశంలో ఓ తార’ అనే చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానంటూ ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్ పరిచయం అయ్యాడు. ఆ అవకాశంతో ఆమె సినిమాలో నటించగా, షూటింగ్ 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య పూర్తయిందని సమాచారం.
అయితే సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆమెకు చెల్లించాల్సిన పారితోషికం రూ.90 వేలు, అలాగే ప్రయాణ ఖర్చుల కింద ఇవ్వాల్సిన రూ.38 వేల మొత్తాన్ని ఇవ్వకుండా కాలయాపన చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. పలుమార్లు డబ్బుల కోసం అడిగినా సరైన స్పందన రాలేదని బాధితురాలు ఆరోపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తనకు రావాల్సిన బకాయిల గురించి మాట్లాడేందుకు బంజారాహిల్స్‌లోని ఓ సినీ నిర్మాత కార్యాలయం వద్దకు రావాలని ప్రసాద్ పిలిచినట్లు ఆమె తెలిపింది. అక్కడికి వెళ్లిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా బెదిరించడమే కాకుండా, బలవంతంగా కారులో తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొంది.
అనంతరం మరిన్ని సినిమా అవకాశాలు కల్పిస్తానని చెప్పి, తన వ్యక్తిగత కోరికలు తీర్చాలని ఒత్తిడి తెచ్చినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె విషయాన్ని తన తల్లికి చెప్పినట్లు సమాచారం. దీంతో బాధితురాలి తల్లి నిందితుడిని ఫోన్లో సంప్రదించి ప్రశ్నించగా, తనను కూడా దుర్భాషలాడి బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడి నుంచి రక్షణ కల్పించడంతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను కోరింది. ఫిర్యాదు స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితురాలి ఆరోపణలపై ఆధారాలు సేకరిస్తున్నామని, కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.