హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం కులగణన చేయకపోతే జనగణనను బహిష్కరిస్తామని నటుడు, ఏపీ, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుమన్ హెచ్చరించారు. చిత్తూరు నుంచి కాణిపాకం వరకు బీసీలు నిర్వహిస్తున్న శంఖారావం పాదయాత్రలో ఆదివారం సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులగణనపై ఆరు రాష్ర్టాలు తీర్మానం చేశాయని, 20 రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయని అన్నారు. కులగణనపై కేంద్రప్రభుత్వం వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల సీఎంలు ఢిల్లీకి వెళ్లి కేం ద్రానికి బీసీల హక్కులపై వివరించాలని విన్నవించారు. బీసీల డిమాండ్ మేరకు కులగణన చేపట్టకపోతే రానున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటును ముట్టడిస్తామని సుమన్ స్పష్టంచేశారు.