వినాయక నగర్ : హోలీ (Holi ) పండుగను ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని నిజామాబాద్ ( Nizamabad ) పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ( CP Sai Chaitanya ) అన్నారు. బలవంతంగా రంగులు వేసే ప్రయత్నం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం నిజామాబాద్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పండుగను అందరూ కలిసి మెలిసి ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.
పరిచయం లేని వ్యక్తులు, సంబంధం లేని వారి వద్దకు వెళ్లి , వారికి ఇష్టం లేకున్నా బలవంతంగా రంగులు వేసేందుకు ప్రయత్నిస్తే సిటీ పోలీస్ యాక్ట్ ( City Police Act) ప్రకారం చట్టారీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మద్యం షాపులను ( Liquar Shops) సైతం బంద్ చేయించినట్లు వెల్లడించారు.
ఈనెల 13 సాయంత్రం 6 గంటల నుంచి 15 తేదీ ఉదయం వరకు మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు బంద్ పాటించాలని ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. హోలీ సందర్భంగా మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
బెట్టింగ్ యాప్ లతో అప్రమత్తంగా ఉండాలి
సోషల్ మీడియాల ద్వారా వచ్చే లోన్యాప్లు, బెట్టింగ్ యాప్లను నమ్మి మోసపోవద్దని సీపీ సాయి చైతన్య సూచించారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడినట్లు దృష్టికి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. నేటి యువత బెట్టింగ్ యాప్ల బారినపడి తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.