సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలోని కాలనీలకు శుభవార్త. మార్చి చివరి నాటికి 272 కాలనీల్లో నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని గృహాలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీరు అందించేందుకు రూ.1200 కోట్లతో చేపట్టిన ఓఆర్ఆర్-2 పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు.
గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఓఆర్ఆర్-2 పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓఆర్ఆర్- 2లో 2,863 కిలోమీటర్ల మేర కొత్త పైప్‌లైన్ వేయనుండగా, ఇందులో ఫిబ్రవరి చివరి నాటికి సుమారు 535 కిలోమీటర్ల పైప్‌లైన్ పూర్తి చేస్తామని వెల్లడించారు.
ఇందుకోసం వెంటనే అవసరమైన ఫీడర్ మెయిన్ , పైప్లైన్కి ఆర్డర్ ఇవ్వాలని అధికారులను ఎండీ ఆదేశించారు. మొదటగా ఈ కొత్త పైప్‌లైన్ ద్వారా ఈ మార్చి చివరి నాటికి 272 కాలనీల్లోని ప్రజలకు నీటి సరఫరా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పేరొన్నారు. ఓఆర్ఆర్-2 మొదటి ఫలాలను ఈ వేసవిలోనే ప్రజలకు అందిస్తామని ఎండీ దానకిశోర్ స్పష్టం చేశారు.
ఓఆర్ఆర్ – 2 ప్రాజెక్టు ఇలా..
ఓఆర్ఆర్-2 ప్రాజెక్టును రూ.1200 కోట్లతో చేపట్టారు. కొత్తగా 137 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం.. ఇన్లెట్, అవుట్లెట్లతో పాటు 2,863 కిలోమీటర్ల నూతన పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతమే కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. 2036 నాటికి ఈ ప్రాంతాల్లో జనాభా 33.92 లక్షలకు పెరగనున్నదని అంచనా వేసి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 2 లక్షల కుటుంబాలకు మంచినీటి కనెక్షన్లు రానున్నాయి.
ఫిబ్రవరిలో రిజర్వాయర్ల నిర్మాణం ప్రారంభం..
ఓఆర్ఆర్-2 పనులను పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి మొదటివారంలో కనీసం 50 శాతం రిజర్వాయర్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారం రోజుల్లో సాయిల్ టెస్ట్ పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ నెలాఖరు లోపు డిజైన్లు పూర్తి చేసి.. నిర్మాణం కోసం యంత్రాలను సిద్ధం చేయాలన్నారు. ఈ ఏడాది చివరి నాటికి కచ్చితంగా అన్ని రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలన్నారు.