Abhijeet Dipke : కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఏర్పాటు చేసి దేశంలో సంచలనం రేపిన అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) పెళ్లి గురించి ఆయన తల్లి అనితా దీప్కే (Anita Dipke) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఢిల్లీలో ముగిసిన విద్యార్థుల ఆందోళనల అనంతరం అభిజీత్‌కు దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు రావడంతో.. ‘మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి’ అంటూ సంబంధాలు వెల్లువలా వస్తున్నాయని చెప్పారు. గతంలో విదేశాల్లో ఉన్నపుడు పెళ్లి మాటెత్తితే అభిజీత్ చిరునవ్వుతో తిరస్కరించేవాడని ఆమె తెలిపారు.
చదువు పూర్తిచేసుకొని ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడ్డాకే పెళ్లి అని చెబుతూ వచ్చాడని అనితా దీప్కే అన్నారు. వచ్చే ఏడాది జనవరి నాటికి కుమారుడికి వివాహం చేయాలని తాము ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కోడలు ఎలా ఉండాలనే విషయంలో తుది నిర్ణయం పూర్తిగా అభిజీత్కే వదిలేశామని చెప్పారు. జీవితంలో అతను తీసుకునే ఏ నిర్ణయానికైనా కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
అభిజీత్ ప్రస్తుతం ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నాడని, ఇంటికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుతామని అనిత చెప్పారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా చాలామంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని, ఆ సమయంలో అభిజీత్‌తో తమ ఆవేదనను పంచుకున్న నాగ్‌పుర్‌కు చెందిన ఓ బాధిత కుటుంబం ఈ సమస్యపై పోరాడాలని కోరిందని తెలిపారు. ఈ ఘటన తర్వాతే విద్యార్థుల కోసం ఏదైనా చేయాలనే లక్ష్యంతో అభిజీత్ తన పోరాటాన్ని ప్రారంభించాడని చెప్పారు.