హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని గీతమ్ డీమ్డ్ వర్సిటీ గురువారం నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్లో 230 కంపెనీలు సుమారు వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించాయి. 300 మంది విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికైనట్టు నిర్వాహకులు తెలిపారు. ఉద్యోగాలు పొందినవారిలో బీటెక్, ఎంటెక్, బీబీఏ, బీకామ్, ఎంబీఏ, బీ ఫార్మసీ, బీఎస్సీ, ఎమ్మెస్సీ అభ్యర్థులు ఉన్నట్టు పేర్కొన్నారు. 150 మంది గీతం విద్యార్థులకు విప్రో ఎలైట్ కంపెనీ ఉద్యోగాలు కల్పించింది. ఇద్దరు గీతం విద్యార్థులు రూ.34 లక్షల వార్షిక వేతనానికి (45 వేల డాలర్లు) ఎంపికయ్యారు. 90 శాతం విద్యార్థులు ఐటీరంగ కంపెనీలు, ఫార్మాస్యూటికల్, ఎంఎల్సీల్లో ఉద్యోగాలు సాధించారు. స్పష్టమైన లక్ష్యం నిర్దేశించుకొన్న వ్యక్తులు తమ గమ్యాన్ని గుర్తించి, ఆ దిశగా విజయం సాధిస్తారని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు.