హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఓటీటీ వేదికల విజృంభణతో రాష్ట్రంలో విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ (వీఏజీ) రంగానికి నూతనోత్సాహం వచ్చింది. దీంతో వచ్చే రెండుమూడేండ్లలో ఈ రంగానికి దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి దాదాపు రూ.750 కోట్ల పెట్టుబడులు వస్తాయని, తద్వారా లక్షల మందికి ఉపాధి లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ల వల్ల ఇటీవలి కాలంలో ఓటీటీల వినియోగం విపరీతంగా పెరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అనేక సంస్థలు సొంతగా ఓటీటీ సేవలను ప్రారంభిస్తున్నాయి. వినియోగదారులకు నాణ్యమైన ఓటీటీ కంటెంట్‌ను అందించాలంటే తప్పనిసరిగా స్పెషల్ ఎఫెక్ట్స్, యానిమేషన్లను వాడాల్సి ఉంటుంది.
మరోవైపు గేమింగ్ రంగం కూడా అనూహ్యంగా వృద్ధి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా కొత్త గేమ్‌లను అభివృద్ధి చేస్తున్నారు. ఫలితంగా వీఏజీ సంస్థలకు డిమాండ్ పెరిగింది. ఈ రంగంలో పెట్టుబడులకు అనేకమంది వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో అద్భుతమైన ఎకోసిస్టం, నిపుణులైన మానవ వనరులు అందుబాటులో ఉండటంతో భారీగా పెట్టుబడులు తరలివస్తాయని నిపుణులు చెప్తున్నారు. వీఏజీ రంగానికి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 250 సంస్థలున్నాయి. సుమారు లక్షన్నర మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ సంస్థలు తమ కార్యకలాపాల విస్తరణ కోసం సిబ్బందిని మరింత పెంచుకోవడంపై దృష్టిపెట్టాయి.
ద్వితీయ శ్రేణి పట్టణాలకూ విస్తరణ
స్పెషల్ ఎఫెక్టులు, యానిమేషన్ల లాంటి వాటికి టీవీ చానళ్లు గతంలో బడ్జెట్ పెట్టేవి కాదు. ఫలితంగా వీఏజీ రంగం సరిగా విస్తరించలేదు. ఉద్యోగుల సంఖ్య కూడా పెద్దగా పెరగలేదు. కానీ ఇప్పుడు ఓటీటీల హవా గణనీయంగా పెరగడంతో కంటెంట్ పరంగా నాణ్యతను పెంచుకోవాల్సి వచ్చింది. ఇందుకోసం కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొనేందుకు ఆయా సంస్థలు ఆరాట పడుతున్నాయి. దేశీయ, అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొంటున్నాయి. దీంతో వీఏజీ సంస్థలు ద్వితీయశ్రేణి పట్టణాలకు సైతం విస్తరించి టాప్‌గేర్‌లో దూసుకెళ్లే అవకాశమున్నదని వీఏజీ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ చిలక తెలిపారు.