Agniveer | న్యూఢిల్లీ, జూన్ 9: సాయుధ దళాల్లో నియామకాల కోసం మోదీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో మార్పులు చేయాలని ఆర్మీ యోచిస్తున్నది. స్కీమ్‌లో భాగంగా నియమితులయ్యే జవాన్ల కనీస సర్వీస్ కాలాన్ని పెంచాలని భావిస్తున్నది. ప్రస్తుతం నాలుగేండ్లుగా ఉన్న సర్వీసును 7-8 ఏండ్లకు పెంచాలని, అదేవిధంగా అగ్నివీరుల్లో 60-70 శాతం మందిని పర్మినెంట్ చేసేలా ఆర్మీ సీనియర్ అధికారులు సిఫార్సులు చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సైన్యం ఉన్నతాధికారుల్లో చర్చలు జరుగుతున్నాయని చెప్పాయి.
కాగా, అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాలని ఎన్డీయే మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీ ఇటీవలే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. టెక్నికల్ గ్రేడుల్లో ప్రవేశించే అర్హత వయసును 23 ఏండ్లకు పెంచాలని, ట్రైనింగ్ సమయంలో అంగ వైకల్యం సంభవిస్తే ఎక్స్‌గ్రేషియో, విధి నిర్వహణలో భాగంగా అగ్నివీర్ చనిపోతే బాధిత కుటుంబానికి జీవనాధార భత్యం వంటి తదితర అంశాలు ఈ సిఫార్సుల్లో ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం మీద పింఛను మొత్తాన్ని తగ్గించుకోవడంతో పాటు, సైన్యంలో యువత అధికంగా ఉండాలనే ఉద్దేశంతో ఆర్మీ ఉన్నదని పేర్కొన్నాయి. సరిహద్దుల్లో శత్రు దేశాలు బలగాల మోహరింపు, సంసిద్ధతను పెంచుతున్న క్రమంలో అగ్నిపథ్ స్కీమ్‌లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని ఆర్మీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.