రాంపూర్హట్, మార్చి 22: పశ్చిమబెంగాల్లో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. బీర్భుమ్ జిల్లాలోని రాంపూర్హట్ శివారులోని బొగ్తూయ్ గ్రామంలో ఎనిమిది ఇండ్లకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడంతో ఇద్దరు చిన్నారులు సహా 8 మంది సజీవ దహనమయ్యారు. బర్షాల్ గ్రామంలో టీఎంసీ నేత భదు సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు. ఈ హత్య జరిగిన కొద్ది గంటలకే అంటే మంగళవారం తెల్లవారుజామున దుండగులు ఇండ్లకు నిప్పు పెట్టారు. ఏడుగురి మృతదేహాలు పూర్తిగా కాలిన స్థితిలో ఉండగా, ఒకరు మాత్రం దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు డీజీపీ మనోజ్ మాలవీయ తెలిపారు. ఘటనకు సంబంధించి 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఘటనపై మమతాబెనర్జీ ప్రభుత్వం ఏడీజీ గ్యాన్వంత్ సింగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
72 గంటల్లో వివరణ ఇవ్వండి..
ఇండ్ల దహనంపై 72 గంటల్లో వివరణ ఇవ్వాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఆ శాఖ జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు త్వరలో ఘటనాస్థలాన్ని సందర్శిస్తారని సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజూందార్ డిమాండ్ చేశారు. ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థ చటర్జీ అసెంబ్లీలో పేర్కొన్నారు. ఘటనపై పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.