హైదరాబాద్,జూలై : ప్రస్తుతం మనిషి దైనందిన కార్యకలాపాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అవసరాలు పెరిగి పోవడంతో జీవనశైలిలో సరికొత్త చేంజెస్ వచ్చాయి. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్లు మనిషి జీవితంలో భాగమయ్యాయి. ఈ ఫోన్ల కారణంగా హెడ్ ఫోన్స్ ,ఇయర్ ఫోన్స్ తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. దాదాపు 90 శాతం మంది లైఫ్ లో హెడ్‌సెట్స్ భాగమైపోయాయి.
అవి పెట్టుకుని ఇప్పుడున్న ఇంటర్ నెట్ ప్రపంచంలో ఇష్టమైన మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయడం యువతకు అలవాటైపోయింది. హెడ్ఫోన్లు,ఇయర్‌బడ్స్ కు ఆదరణ పెరిగింది. వీటిని వినియోగించేవారి శాతం మరింతగా పెరుగుతున్నది. రాబోయే ఐదేళ్లలో మార్కెట్ లో సంవత్సరానికి 20 శాతం పెరుగుతుందని అంచనా.ఇలాగే ఎక్కువసేపు,ఎక్కువ సౌండ్ వినడంవల్ల వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉన్నదని పరోశోధకులు హెచ్చరిస్తున్నారు.
70 డెసిబెల్స్ కి మించి వినకూడదు.
ఎక్కువ సౌండ్ పెట్టుకుంటే పిల్లలు, యువత వినికిడి శక్తి పోగొట్టుకోవాల్సివస్తుందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. వరల్డ్ పబ్లిక్ హెల్త్ రిపోర్ట్ ప్రకారం 70 డెసిబెల్స్ కి మించి సౌండ్ వినకూడదు. అలా చేస్తే భవిష్యత్తులో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ చాలా మంది పిల్లలు,యువత 85 డెసిబెల్స్ ఆడియో వింటున్నారు.ఇది అత్యంత ప్రమాదకరమని అమెరికాకు చెందిన చారిటీ సంస్థ ది క్వైట్ మెంబర్ డేనియల్ ఫింక్ చెబుతున్నారు.
ఒక రోజులో గంటకు పైగా 85 డెసిబెల్స్ కు మించి ఆడియో వినే పిల్లలు,యువకుల్లో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. 85 డెసిబెల్స్ సురక్షితం అని ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. అయితే దీన్ని ఆయన తప్పుబడుతూ, ఇది ఎవరికీ సురక్షితమైన పరిణామం కాదని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ 85 డిబిఎ సౌండ్ ఎక్స్పోజర్ లెవల్ ను సిఫార్సు చేసినట్లు వాల్‌స్ట్రీట్ కథనం ఇటీవల పేర్కొంది. కానీ దీనికి భిన్నంగా డేనియల్ ఫింక్ వ్యాఖ్యలు చేశారు.
70 డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ పిల్లలు,యువకులకు అంత మంచిది కాదని ఆయన చెబుతున్నారు. అయితే ఫ్యాక్టరీలో శబ్ధాల మధ్య పనిచేసే కార్మికులు,లేదా భారీ పరికరాల ఆపరేటర్లకు 85 డెసిబెల్స్ సౌండ్ వరకు ఎటువంటి ప్రమాదం లేదని,ఈ ప్రమాదం చిన్నపిల్లల్లోనే ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ఏదేమైనా పిల్లల చెవులు జీవితకాలం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి,సాధ్యమైనంత వరకు హెడ్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్ వాడకాన్ని తగ్గించాలని చెప్పారు. ఒకవేళ ఉపయోగించినా సరే 70 డెసిబెల్స్ కంటే ఎక్కువ స్థాయిలో ఆడియో వినకూడదని ఆయన సిఫార్సు చేస్తున్నారు.