బీజింగ్: చైనాలోని షాంఘై, ఝాంగియాన్ ప్రాంతంలో హుయాయాన్లీ భవన సముదాయాన్ని రోజుకు 10 మీటర్ల చొప్పున పక్కకు జరుపుతున్నారు. రోబోలు, ఏఐ (కృత్రిమ మేధ) సహకారంతో, మానవ కార్మికుల అవసరం లేకుండా ఈ పని జరుగుతుండటం విశేషం. 1920-1930 మధ్య కాలంలో నిర్మితమైన ఈ భవన సముదాయం బరువు 7,500 మెట్రిక్ టన్నులు. ఇది 4,030 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీని కింద 53 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో సాంస్కృతిక, వాణిజ్య ప్రాంతాలు, పార్కింగ్ కేంద్రాలను నిర్మించడం కోసం దీనిని పక్కకు జరుపుతున్నారు. ఈ నిర్మాణాలు పూర్తయిన తర్వాత హుయాయాన్లీ భవన సముదాయాన్ని తిరిగి యథాస్థానానికి తీసుకొస్తారు.
డీప్ లెర్నింగ్ ఏఐ సాయంతో ప్రమాదాల నివారణ
హుయాయాన్లీ భవన సముదాయాన్ని పాశ్చాత్య, చైనీస్ వాస్తు పద్ధతుల్లో నిర్మించారు. దీనిని 432 నడిచే చిన్న రోబోలు నెమ్మదిగా పైకి ఎత్తి, అత్యంత నెమ్మదిగా పక్కకు జరుపుతాయి. ఈ ప్రాంతంలోని భవనాల మధ్య ఖాళీ స్థలాలు, దారులు ఇరుకుగా ఉంటాయి. పాత కాలంనాటి భవనాలు దగ్గర దగ్గరగా ఉంటాయి. అందుకే ఈ ప్రాజెక్టు కోసం డ్రిల్లింగ్, స్పెషల్ ఎర్త్ మూవింగ్ రోబోలను ఉపయోగిస్తున్నారు. ఇవి 1.2 మీటర్ల ఇరుకైన ప్రదేశంలో కూడా పని చేయగలవు. ఈ స్థలంలో మట్టి, రాళ్ల వంటి పదార్థాలను గుర్తించడానికి డీప్ లెర్నింగ్ ఏఐ సాయపడుతున్నది. భవనాలు, స్థలం 3డీ నమూనాలను అత్యంత వివరంగా రూపొందించడానికి ఇంజినీర్లు బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, పాయింట్ క్లౌడ్ స్కానింగ్లను ఉపయోగించారు. ఒకదానికొకటి ఢీ కొట్టే ముప్పును గుర్తించేందుకు, మట్టిని రవాణా చేయడానికి మలుపులు గల మార్గాలను డిజైన్ చేయడానికి ఈ మోడల్స్ ఉపయోగపడుతున్నాయి.