హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): స్టాక్ మార్కెట్ ఎంతవేగంగా దూసుకుపోతున్నదో, అంతేవేగంతో మదుపుచేసే ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మదుపుదార్లు మరింతగా విస్తరిస్తున్నారు. బాంబే స్టాక్ ఎక్చేంజ్ (బీఎస్ఈ) గణాంకాల ప్రకా రం తెలంగాణ నుంచి ఆ ఎక్సేంజీలో రిజిష్టరైన ఇన్వెస్టర్ల సంఖ్య ఈ నవంబర్ 9 నాటికి 26,31,134కి చేరుకుంది. గతేడాది ఇదే తేదీ నాటికి ఆ సంఖ్య 14,40,148 కాగా, సంవత్సరకాలంలో రాష్ట్రం నుంచి 11,90,946 మంది కొత్త ఇన్వెస్టర్లు (82.69 శాతం వృద్ధి) రిజిష్టర్ అయ్యారు. దక్షిణాది రాష్ర్టాల్లోకెల్లా తెలంగాణలోనే కొత్త ఇన్వెస్టర్ల వృద్ధి జోరు ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏడాదికాలంలో 41 శాతం కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షించగా, తమిళనాడులో ఈ వృద్ధి 33.3 శాతంగా ఉంది. కర్నాటకలో 48 శాతం వృద్ధిచెందగా, కేరళలో 37 శాతం పెరిగారు.
యువతలో ఆసక్తి
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ యువత…అధిక రాబడుల కోసం స్టాక్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారని, స్టాక్ సూచీలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఇటు మళ్లుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మిల్లీనియల్స్ సైతం మార్కెట్ పట్ల ఎంతో బుల్లిష్‌గా ఉన్నారు. ఈ ట్రెండ్ ఎలా ఉందంటే…హైదరాబాద్ విద్యార్థిని కృష్ణ హర్షిత 19 ఏండ్ల వయస్సు నుంచే తన పాకెట్ మనీని పెట్టుబడి పెడుతూ ఏడాదికల్లా మంచి స్టాక్ పోర్ట్‌ఫోలియోకు యజమాని అయ్యింది. ‘ మా నాన్న షేర్లలో పెట్టుబడి పెట్టేవారు. కరోనా లాక్‌డౌన్‌తో గతేడాది అంతా ఇంట్లోనే ఉండటంతో మార్కెట్ గురించి అధ్యయనం చేసి, పెట్టుబడులు ప్రారంభించా’ అంటూ హర్షిత చెప్పుకొచ్చింది.
మార్కెట్ రిస్క్‌లకు సిద్ధం
ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వివేక్ సింగ్ కూడా ఈ మధ్య షేర్లు కొనడం ఆరంభించాడు. గతంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారు ఇప్పుడు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారని, ప్రస్తుతం యువత కొన్ని రిస్క్‌లు తీసుకోవడానికి సిద్ధపడుతున్నదని వివేక్ తెలిపాడు. ప్రతీ కంపెనీ గురించి ఆన్లైన్లో సమాచారం లభ్యమవుతున్నదని, పెట్టుబడి చేసేముందు పరిశోధించడానికి ఇది ఉపయోగకరంగా ఉందన్నాడు. ఇటువంటి అభిప్రాయాలతోనే సిప్‌లు, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడిచేసేవారు ఇటీవలికాలంలో బాగా పెరుగుతున్నారు.
గుడ్డిగా పెట్టుబడి పెట్టట్లే
ఇప్పుడు మార్కెట్‌వైపు అడుగులేస్తున్న యువత గుడ్డిగా పెట్టుబడి పెట్టట్లేదు. మంచి పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో ఎలా రూపొందించుకోవాలన్న అవగాహనతోనే పెట్టుబడులకు ఉపక్రమిస్తున్నారు. తొలి ఏడాది వైద్య విద్యార్థిని అయిన సహిత ఇలా అంటోంది…‘నేను వివిధ పరిశ్రమలకు చెందిన షేర్లలో ఇన్వెస్ట్‌చేస్తూ, పోర్ట్‌ఫోలియోను వివిధీకరిస్తున్నా. చాలా సమయం మార్కెట్ కదలికల్ని గమనించి, వివిధ వార్తలకు ఆయా షేర్లు ఎలా హెచ్చుతగ్గులకు లోనవుతాయో చూస్తుంటా. పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేయడంతో ఒక షేరు తగ్గినా, మరో షేరు పెరగడం ద్వారా నష్టం భర్తీ అవుతుంది’