ATA | బాల్టిమోర్ (అమెరికా): అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ మహాసభలు, యువజన సదస్సు దిగ్విజయంగా ముగిశాయి. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు (జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు) ఘనంగా జరిగాయి. ఉత్తర అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన తెలుగు ప్రజలతో బాల్టిమోర్ నగరం ఒక మినీ తెలుగు సీమను తలపించింది. తెలుగు భాషాభిమానం, సామాజిక ఐక్యత, ఆర్థిక పురోగతి, భావితరాల చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఈ మహాసభలు ‘సూపర్ డూపర్ హిట్’ అని ఈ సమావేశాలకు హాజరైన ప్రతినిధులు అభివర్ణించారు. ఆటా చరిత్రలోనే ఈ వేడుకలు ఒక చిరస్మరణీయ మైలురాయిగా నిలిచాయని వక్తలు కొనియాడారు.
ఈ మహాసభలకు అమెరికా జాతీయ రాజకీయ దిగ్గజాలతో పాటు భారతదేశానికి చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మేరీల్యాండ్ గవర్నర్ వెస్మూర్ (Wes Moore) మాట్లాడుతూ.. మేరీల్యాండ్, అమెరికా సమగ్ర అభివృద్ధిలో తెలుగు ప్రవాసుల పాత్రను కొనియాడారు. సాంకేతికత, వైద్యం, విద్య, వ్యాపారం, పౌర సేవల్లో తెలుగు వారి నిబద్ధతను అభినందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ మాట్లాడుతూ.. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా అమెరికన్ సమాజంలో ఉన్నత అవకాశాలను సాధించవచ్చని సూచించారు.
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గజాలా ఎఫ్ హష్మీ తన హైదరాబాద్ జ్ఞాపకాలైన పాతబస్తీ, చార్మినార్, లాడ్ బజార్, హైదరాబాదీ బిర్యానీ, రైలు ప్రయాణాలను వివరించడంతో ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ప్రవాసులు పౌర, రాజకీయ ప్రక్రియల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రగతి, మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ రాష్ట్రాభివృద్ధికి, ఉపాధి కల్పనకు ప్రవాస పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ వేడుకల్లో తానా, నాట్స్, టీటీఏ, టీడీఎఫ్, ఏఏపీఐ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొని తెలుగు సమాజ ఐక్యతను చాటారు.

Ata
అమెరికా సాయుధ దళాల్లో (American Army) సేవలందిస్తున్న తెలుగు మహిళలు, పురుషులను సత్కరించారు. ఈ వేడుకల్లో కవిత్వం, సాహిత్యం, సినిమా, చరిత్రపై చర్చించారు. పారిశ్రామిక వేదికల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, వైద్యం, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాల్లో అవకాశాలపై సీనియర్ పారిశ్రామికవేత్తలు, యువ స్టార్టప్ వ్యవస్థాపకులు సలహాలు, సూచనలు ఇచ్చారు. రెండో, మూడో తరాల తెలుగు-అమెరికన్ యువత కోసం సంస్కృతి, నెట్వర్కింగ్, నాయకత్వ నైపుణ్యాలు, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగు సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న జానపద గీతాలు ఈ వేదికకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్, జనార్దన్ పన్నెల బృందం ఆలపించిన తెలంగాణ జానపద గేయాలు మార్మోగాయి. అలాగే కీరవాణి స్వర నీరాజనం ఆకట్టుకుంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, హీరో అడివి శేష్, నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీధర్ గౌడ్, వరుణ్ సందేశ్, పూజా హెగ్డే, రీతూ వర్మ, అనన్య నాగళ్ల, దివి వడ్త్యా అభిమానులతో ముచ్చటించారు. యువ నటుడు నవీన్ పొలిశెట్టి తన టైమింగ్ కామెడీ పంచ్లతో సభికులను నవ్వుల్లో ముంచెత్తారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, గాయని సునీత, త్రీయరీ, ఆరెంజ్ స్ట్రీట్ బృందాలు ప్రదర్శనలు ఇచ్చాయి.
ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బానాల, సతీష్ రెడ్డి రామసహాయం, కోర్ కమిటీ సభ్యులు భోజనం, రవాణా, లాజిస్టిక్స్ ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు. 2028లో జరగబోయే 20వ ఆటా మహాసభలకు డాలస్ (టెక్సాస్)లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు.