పెద్దపల్లి జంక్షన్, మార్చి 25: ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకున్న పెద్దపల్లి నియోజకవర్గంలోని 123 మంది నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎంసహాయనిధి కింద రూ. 56,71,500 మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన చెక్కులను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఆపదలో ఆదుకున్న సర్కారుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు. అనారోగ్యం బారినపడి ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా అండగా నిలుస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ అనంతరెడ్డి, పెద్దపల్లి పట్టణ కౌన్సిలర్లు ఇల్లందుల కృష్ణమూర్తి, పైడ పద్మారవి, చంద్రశేఖర్, మాధవి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, సుల్తానాబాద్ ఏఎంసీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్, గొల్లపల్లి ఎంపీటీసీ గట్టు శ్రీనివాస్, గర్రెపల్లి అంజన్న, దాసరి వేణు, దాసరి నరేశ్, కొంకటి లింగమూర్తి పాల్గొన్నారు.