సిటీబ్యూరో, జూలై 4(నమస్తే తెలంగాణ): తినే అన్నంలో కల్తీ,. తాగే పాలలో కల్తీ.. చివరకు పసిబిడ్డలకు పట్టే పాలపొడిలోనూ ప్రాణాంతక పదార్థాలు.. ఇది ఏదో సినిమా డైలాగ్ కాదు.. నగరంలో హెచ్ ఫాస్ట్ పోలీసుల దాడుల్లో వెలుగుచూస్తున్న సంచలనాత్మక విషయాలు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న కల్తీ ముఠాల ఆటకట్టించేందుకు కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్(హెచ్-ఫాస్ట్)ను ఏర్పాటు చేసి వంద రోజులైంది.
ఈ ఏడాది మార్చి 19న ఈ ప్రత్యేక విభాగం నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రత్యేక దృష్టితో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఫుడ్‌సేఫ్టీ, జీహెచ్ఎంసీ, వెటర్నరీ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆకస్మిక తనిఖీలు, నిరంతర దాడులతో నగరంలో ఆహార కల్తీని అరికట్టేందుకు ఈ విభాగం ప్రయత్నిస్తోంది. టాస్క్‌ఫోర్స్ డీసీపీ నేతృత్వంలో 36 మంది అధికారులు, సిబ్బందితో నిరంతరం హెచ్ ఫాస్ట్ విభాగం పనిచేస్తోంది.
మూడునెలలుగా నగరంలో వెలుగు చూసిన కల్తీ మాఫియా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొదలుకొని తాగే టీ పౌడర్ వరకు నెయ్యితో సహ కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు ప్రతిఒక్క వస్తువు కల్తీమయం కావడంతో సిటీ పోలీసులు ఈ మాఫియాపై దృష్టి పెట్టారు. వంద రోజులుగా సిటీ పోలీసులు నగరంలో పలు చోట్ల చేసిన దాడుల్లో 121.87 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను సీజ్ చేశామని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. హెచ్‌ఫాస్ట్ బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో వివిధ జోన్ల పరిధిలో 185 కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
జోన్ల వారీగా వివరాలు పరిశీలిస్తే అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్లో 55 కేసులు .. నమోదు కాగా, గోల్కొండలో 44, సికింద్రాబాద్‌లో 35, చార్మినార్‌లో 21, శంషాబాద్‌లో 13, ఖైరతాబాద్ జోన్లో 5 కేసులు నమోదైనట్లు తెలిపారు. పసిపిల్లలకు తినిపించే బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌లతో సహ వంటింట్లో వాడే టీ పొడి, పాలు , పెరుగు తదితర వస్తువులన్నీ కల్తీమయమవుతున్నట్లుగా గుర్తించామని సజ్జనార్ తెలిపారు. పోలీసు చర్యలతో పాటు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు తదుపరి చర్యల కోసం 247 కేసులు అప్పగించారు.
కల్తీ పదార్థాల్లో వారు కల్తీ చేస్తున్న విధానం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో వెల్లుల్లి పొట్టు, సింథటిక్ రంగులు, ప్రమాదకరమైన శాంటిక్ , ఎసిటిక్ యాసిడ్లను కలుపుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన కుళ్లిపోయిన చికెన్, మటన్‌ను రసాయనాలతో కడిగి తాజాగా చూపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పామాయిల్, ఇతర చౌక నూనెలతో కలిపి నెయ్యిగా చెలామణీ చేస్తున్నారని, చెక్కపొట్టు టీ పొడిగా మార్చి సామాన్యుడి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. గడువు ముగిసిన డ్రై ఫ్రూట్స్, సమోసాలు, పండుగ సమయాల్లో విరివిగా వాడే పేణీల్లో సైతం విషపూరిత రసాయనాలు వాడుతున్నారని, పన్నీరుతో సహ ప్రతి ఒక్క వస్తువు కల్తీ కావడంతో ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదమున్నట్లుగా గుర్తించామని పేర్కొన్నారు.
ఈ మేరకు తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఫుడ్ సేఫ్టీ కోసం పనిచేస్తున్నాయని, అందులో కల్తీ వస్తువులను గుర్తించడం కోసం స్థానిక పోలీసు సిబ్బంది సహకారంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. బ్రాండెడ్ వస్తువుల కంటే తక్కువ ధరకు వస్తుండడంతో ప్రజలు ఆశకు పోయి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని సజ్జనార్ తెలిపారు. ఇప్పుడు పోలీసుల ఇస్తున్న ఈ అలర్ట్‌ను గమనించి ప్రతి పౌరుడు కచ్చితంగా కల్తీ మాఫియా అంతం కోసం సహకరించి ముందుకు రావాలని ప్రజలను కోరారు.