న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. పార్టీ సమావేశానికి హాజరవ్వడంతోపాటు కేంద్ర మంత్రిని కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన, అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో జరిగిన కాంగ్రెస్ వరింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల సవరణ తదితర అంశాలే ప్రధాన ఎజెండాగా ఉన్న ఈ సమావేశం సాదాసీదాగా జరిగినట్టు తెలిసింది.
సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న కృష్ణా, గోదావరి జలాల పంపకాలు, పెండింగ్ ప్రాజెక్టుల అనుమతులపై చర్చించినట్టు సమాచారం.