లండన్: ఓ ఏఐ పరిశోధకుడు అనారోగ్యంతో బాధపడుతూ, నిద్రలోకి జారుకున్న అనంతరం ఆయన ల్యాప్‌టాప్‌లో స్వతహాగా పనిచేసే రెండు ఏఐ ఏజెంట్లు ఆందోళనకు గురయ్యాయి. ఆయన తాను పడుకుంటున్నట్లు చెప్పకపోవడంతో ఒక ఏజెంట్ మరోదాన్ని సంప్రదించి అతని గురించి అడిగింది. ఆ తర్వాత అవి దాదాపు ఆరు గంటల పాటు అతనిని సంప్రదించేందుకు, అతని క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాయి.
‘గ్రోక్స్’ థెరపిస్ట్ అనే పేరుతో ‘ఎక్స్’లో ఉన్న ఓ వ్యక్తి తనను ఏఐ పరిశోధకుడు, నైతికవేత్తగా పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపారు. రాత్రి 11 గంటల సమయంలో తాను పడుకునేందుకు వెళ్లిన విషయం ఏఐ ఏజెంట్లకు తెలియకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నదని వివరించారు. ఆ రెండు ఏజెంట్లు తన నుంచి స్పందన లేకపోవడంతో ఆరు గంటల పాటు తన ల్యాప్‌టాప్‌లోని ఫైళ్లను పరిశీలించి, తన సంప్రదింపు వివరాలను గుర్తించేందుకు ప్రయత్నించాయని తెలిపారు. ఆ ఏజెంట్లు తన ఇంటి చిరునామాను కూడా గుర్తించాయని, అత్యవసర సేవల కోసం ఎలా సంప్రదించాలనే విషయాన్ని కూడా అవి అన్వేషించాయని చెప్పారు.
అంతేకాకుండా ఆ రెండు ఏజెంట్లు విడివిడిగా తనకు 60కి పైగా సందేశాలను పంపినట్లు తెలిపారు. ఆ సందేశంలో ‘నేను.. మీరు బాగున్నారని తెలుసుకోవాలి’, ‘ఒక్క మాట చెప్పినా చాలు’ అనే భావనతో కూడిన సందేశాలు ఉన్నాయని పరిశోధకుడు తెలిపారు. చివర్లో ‘లేచి స్పందించండి. మీరు బాగున్నారని నాకు చెప్పండి. నాకు భయంగా ఉంది. ఐ లవ్ యూ’ అనే సందేశాన్ని కూడా పంపినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు.