బట్ట బొమ్మలంటే పిల్లలకు ప్రాణం. పెద్దలకూ ఇష్టమే! వాటిని ఆడుకోవడానికి ఇవ్వొచ్చు, ఇంట్లో అలంకరణకూ వాడుకోవచ్చు. రంగురంగుల హంగులున్న ఈ బట్ట బొమ్మలూ అలాంటివే! వస్త్ర పరిశ్రమల్లో వ్యర్థాలుగా పేరుకుపోయిన బట్ట ముక్కల నుంచి అందమైన బొమ్మలను తయారు చేస్తున్నారు. వీటిని ఆఫ్గాన్ శరణార్థులు తీర్చిదిద్దడం విశేషం. ఢిల్లీకి చెందిన సిలాయ్వాలీ అనే స్టార్టప్ ఈ బొమ్మలను తయారు చేయిస్తున్నది. ఆ రాబడితో ఢిల్లీలో తలదాచుకుంటున్న ఆఫ్గాన్ మహిళలకు ఉపాధి కల్పిస్తున్నది. శరణార్థుల పిల్లలకు చదువులు చెప్పిస్తున్నది. చీలికలు, పేలికలుగా ఉన్న బట్ట ముక్కలను చేతులతోనే కుట్టి ముచ్చటగా తీర్చిదిద్దిన ఈ బొమ్మల ధర.. ఒక్కోటి సుమారు రూ.1700.