ఆందోళన అన్న మాట వినగానే ఓ విధమైన ప్రతికూలత తోస్తుంది. కారణం, ఆందోళన వల్ల మనకు కనిపించే ఫలితాలే. మనసులో అసంతృప్తి, శరీరంలో అలజడి, పరిస్థితులు మన చేతిలో లేవనే నిస్సహాయత, బలహీనులమనే న్యూనత… వెరసి ఆందోళన ఉందని ఒప్పుకోవడానికే భయపడతాం. కానీ, ముందుగా చెప్పినట్టు… ఆందోళన ఒక సహజమైన ఉద్వేగం. దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోగలిగితే మార్గదర్శిలా మారుతుంది. లేదంటే, అదుపు తప్పి మన మీదే దాడి చేస్తుంది. కాబట్టి, అదేదో ప్రకటనలో మరక మంచిదే అన్నట్టు..ఆందోళనా మన మంచికే!
అపసవ్యానికి సూచన
ఆందోళన ఉందంటే, జీవితంలో ఏదో అపసవ్యత ఉందనే అర్థం. అది బంధం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, భవిష్యత్ పట్ల చింత కావచ్చు. ఆందోళనకు మూల కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, జీవితాన్ని గాడిన పెట్టే అవకాశం ఉంటుంది.
ఓ ప్రేరకం
కొద్దిపాటి స్థాయిలో ఆందోళన మనల్ని చురుగ్గా, మెరుగ్గా ఉండేలా చేస్తుంది. ఉదాహరణకు విద్యార్థులు, క్రీడాకారులు పోటీకి ముందు కొంత ఆందోళన చెందుతారు. దీన్ని ‘పర్ఫార్మెన్స్ యాంగ్జయిటీ’ అంటాం. దీని వల్ల వారి పనితీరు మెరుగుపడిందని పరిశోధనలు తేల్చాయి. కొద్దిపాటి ఒత్తిడి, మన మెదడు సామర్థ్యాన్ని పెంచుతుందని నిరూపించే ప్రయోగాలూ అనేకం జరిగాయి.
పరోక్ష హెచ్చరిక
అర్ధరాత్రి ఆటోలో ప్రయాణిస్తున్నాం. బండి దారి తప్పిందనే అనుమానం కలిగింది. సహజంగానే ఆ పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఏదో ఒక జాగ్రత్త పాటించమంటూ హెచ్చరిస్తుంది. మన జీవితంలో ఇలాంటి సందర్భాలు కోకొల్లలుగా ఎదురవుతాయి. కాస్త ఆందోళన పడుతూ బండి నడిపేవాళ్లు, తక్కువ ప్రమాదాలకు లోనవుతారంటూ బ్రిటన్‌లో జరిగిన ఓ పరిశోధన తేల్చింది. ఓ రకంగా చెప్పాలంటే, ఆందోళన మనకు రక్షణ కవచంలా పనిచేస్తుంది.
స్పందించే మనసుకు సాక్ష్యం
జీవితంలో అనేక కష్టాలు ఉన్నవారు త్వరగా ఆందోళనకు గురవుతుంటారు. అది తెలిసిందే! సహజంగానే వాళ్లు ఎదుటివారి సమస్యలను త్వరగా గ్రహించగలుగుతారు. వాళ్ల కష్టంలో తమను తాము చూసుకుని స్పందించగలుగుతారు. ఇజ్రాయిల్‌కు చెందిన సైకాలజిస్టులు ఈ విషయమై ఓ పరిశోధన పత్రాన్ని రూపొందించారు.
మంచి నాయకులు
ఆందోళనతో ఉండేవాళ్లు, ఎటువైపు నుంచి ఏ సమస్య వస్తుందా అని నిశితంగా గమనిస్తుంటారు. తన వెనుక నడిచేవాళ్లను కూడా జాగ్రత్తగా గమనించుకుంటారు. వ్యూహాన్ని అమలు చేసేటప్పుడు కూడా అది కట్టుదిట్టంగా ఉందా లేదా అని ఒకటికి రెండుసార్లు తరచి చూసుకుంటారు.
ఏకాగ్రత పెరుగుతుంది
కొన్నిసార్లు ఆందోళన మన ప్రాధాన్యాలను గుర్తుచేస్తుంది. అది దగ్గర పడే గడువు తేదీ కావచ్చు, ఆరోగ్య సమస్యా కావచ్చు. దాని మీద మన దృష్టి పెరిగి, తగిన పరిష్కారాన్ని కనుగొనేలా ప్రోత్సహిస్తుంది.
విజయాన్ని నిలుపుకొనేలా
ఒక స్థాయికి చేరుకున్నాకో, ఒక విజయాన్ని అందుకున్నాకో… అది చేజారిపోతుందనే ఆందోళన నిరంతర కృషికి దారితీస్తుంది. ఇతరుల అంచనాలను అందుకోవాలనే తపన మొదలవుతుంది.
శక్తిని అందిస్తుంది
ఇంతకుముందు చెప్పుకొన్నట్టు fight or flight తో శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది. మానసికంగా, శారీరకంగా ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనే సన్నద్ధత అందిస్తుంది. పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేసేట్టు చేస్తుంది. ఇక ఇక్కడి నుంచీ మీ విజయ యాత్ర మొదలవుతుంది. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు.
క్రమశిక్షణ కోసం
తెల్లవారుజామునే ఠంచనుగా నిద్రలేచే అలవాటు ఉన్నవాడు, సమయం దాటితే ఉలిక్కిపడి లేస్తాడు. ఫలానా సమయానికి ఎవరినైనా కలవాలన్న ఆందోళన ఉంటే… ఎలాగైనా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తాం. మాట పోతుందన్న ఆందోళన ఉన్నప్పుడు ఆరునూరైనా దాన్ని నిలబెట్టుకుని తీరుతాం. మనం కట్టుదాటకుండా చూస్తుంది ఆందోళన.