న్యూఢిల్లీ, ఆగస్టు 22: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) చైర్మన్ మనన్ మిశ్రా రాజీనామా చేయాలని ఆ సంస్థ సహ చైర్మన్, సీనియర్ న్యాయవాది వైఆర్ సదాశివరెడ్డి డిమాండ్ చేశారు. మిశ్రా నాయకత్వంలో బీసీఐ ఆశించిన ప్రమాణాల మేరకు పని చేయలేదని సదాశివరెడ్డి ఒక లేఖలో ఆరోపించారు. ఈ లేఖ అందిన 15 రోజుల్లోపు బీసీఐ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని అన్నారు. బీసీఐ ఎవరి జాగీరు కాదని, దానికున్న అధికారాలు పార్లమెంట్ ద్వారా వచ్చాయని గుర్తుచేశారు.
బీసీఐ ట్రస్ట్‌ను నిర్వీర్యం చేశారని, కౌన్సిల్ నిధులలో సుమారు రూ.150 కోట్లు కొత్తగా ఏర్పాటుచేసిన ట్రస్ట్‌కు మళ్లించారని రెడ్డి ఆరోపించారు. తాను లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు బీసీఐ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ట్రస్ట్ నమోదు అయినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఆర్థిక లావాదేవీలపై స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీఐ వ్యవస్థలో నియామకాలు పారదర్శకమైన ప్రక్రియ లేకుండా జరిగాయని మిశ్రాపై ఆయన ఆరోపణలు గుప్పించారు. కౌన్సిల్ నిర్వహించే సంస్థల్లోని కీలక పదవులను మిశ్రా కుటుంబ సభ్యులు చేపట్టడం పట్ల కూడా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నుంచి ఉత్తీర్ణులవుతున్న విద్యార్థులకు వ్యతిరేకంగా జారీ చేసిన ఆదేశాన్ని కూడా రెడ్డి ప్రశ్నించారు.
బీసీఐ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లను మనన్‌కుమార్ మిశ్రా తిరస్కరించారు. తాను ఎన్నిక ద్వారా ఈ పదవిని చేపట్టానని, దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది న్యాయవాదులకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని పేర్కొన్నారు. తన రాజీనామా కోరుతూ ఢిల్లీలోని వేర్వేరు బార్ అసోసియేషన్లకు చెందిన పలువురు న్యాయవాదులు శుక్రవారం బీసీఐ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇలా ఉండగా బీసీఐ చైర్మన్‌గా మనన్ కుమార్ మిశ్రా కొనసాగడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. న్యాయవాది దీపక్ ప్రకాశ్ ద్వారా న్యాయవాది యోగమయ ఎంపీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. బీసీఐ నిబంధనలకు విరుద్ధంగా దశాబ్దానికిపైగా చైర్మన్ పదవిలో మిశ్రా కొనసాగడాన్ని పిటిషనర్ సవాలు చేశారు.