లక్నో: ఆరెస్సెస్ అగ్రనేత మోహన్ భాగవత్‌తో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. శనివారం యోగి సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో వీరి భేటీ ఉండనున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆరెస్సెస్ కార్యకర్తల సమావేశాల కోసం భాగవత్ గోరఖ్‌పూర్ పర్యటనకు వచ్చారు.
మరోవైపు అభివృద్ధి పనులపై సమీక్ష కోసం యోగి కూడా గోరఖ్‌పూర్ వెళ్లనున్నారు. అసలైన సేవకుడికి అహంకారం ఉండదని, హుందాగా ప్రజాసేవ చేస్తాడని లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత భాగవత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో మోహన్ భాగవత్, యోగి ఆదిత్యనాథ్ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.