UP CM’s | దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం.. ఉత్తరప్రదేశ్.. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది యూపీ.. కానీ ఈ రాష్ట్రానికి సీఎంలు అయిన వారు.. ఇక ముందు కావాలని కోరుకునే వారు అసెంబ్లీకి పోటీ చేయరట. ఇప్పటి వరకు సీఎంలుగా పని చేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి మొదలైన ఈ ధోరణి సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్.. తాజా సీఎం యోగి ఆదిత్యనాథ్ వరకు కొనసాగుతోంది. ఇకముందు కూడా వారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోమని సంకేతాలిచ్చారు.
మరో ఐదు నెలల్లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ తరుణంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం కంటే ఎమ్మెల్సీగా కొనసాగడానికే మొగ్గు చూపుతానని.. తనకు ఇష్టమైన గోరఖ్పూర్ దేవాలయం వద్ధ యోగి ఆదిత్యనాథ్ సంకేతాలిచ్చారు. ఒకవేళ బీజేపీ పార్లమెంటరీ బోర్డు పోటీ చేయాలని నిర్ణయిస్తే రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా పోటీ చేస్తానన్నారు. వచ్చే ఏడాది ఎమ్మెల్సీగా కొనసాగడానికి బదులు ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చునన్నారు. 2017లోనూ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్.. గోరఖ్పూర్ ఎంపీ.. అయినా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అటుపై 2017 సెప్టెంబర్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
కొన్ని రోజుల క్రితం అఖిలేశ్ యాదవ్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. కానీ ఆయన సారధ్యంలోని సమాజ్వాదీ పార్టీ మాత్రం.. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని వాదించింది. అఖిలేశ్ వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆడిపోసుకుంది. 2012లో సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అఖిలేశ్ యాదవ్.. అదే ఏడాది ఏప్రిల్లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
అఖిలేశ్ యాదవ్కు ముందు సీఎంగా ఉన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం ఇదే పని చేశారు. 2007లో సంపూర్ణ మెజారిటీతో బీఎస్పీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆమె అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించడానికి బదులు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీనికి ఆమె ఓ ఫార్ములా తీసుకొచ్చారు. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాలూ తనకు సమానమేనన్నారు. అన్ని సెగ్మెంట్లనూ సమానంగా చూస్తానని చెప్పారు.
నేరుగా ప్రజల నుంచి ఎన్నికైన వారే ప్రధానులుగా, సీఎంలుగా నియమితులవుతారని నానుడి. అయితే, అవసరమైనప్పుడు ఎగువ సభకు ఎన్నికై ప్రధాని లేదా సీఎం పదవిలో కొనసాగొచ్చు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. అంతకుముందు 1991లో ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఇది ఇటీవలి కాలం వరకూ కొనసాగింది.
రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికైన వారే సీఎంలు అవుతారు.. ఎన్నికవ్వకున్నా.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందొచ్చు. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంది. అదే శాసనమండలి (విధాన పరిషత్). అలా శాసనమండలి గల రాష్ట్రాల్లో యూపీతోపాటు బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.
ఇటీవల పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతాబెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ గెలుపొందినా.. ఆమె ఓటమి పాలయ్యారు. కానీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రావడంతో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్లో శాసనమండలి లేకపోవడంతో గత నెలలోనే భవానీపూర్కు జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందారు. కానీ యూపీకి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంది.