న్యూఢిల్లీ, జూన్ 19: యోగాతో పురుషుల్లో వీర్యం నాణ్యత పెరుగుతుందని, వంధ్య త్వం ఉన్న వారిలో డీఎన్ఏను ధ్వంసం కాకుండా నిరోధిస్తుందని ఎయిమ్స్ పరిశోధకులు కనుగొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పరిశోధన వివరాలను యోగా ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రచురించారు. పురుషుల్లో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆ నివేదిక పేర్కొన్నది.
ఈ పరిశోధనలో.. 12 వారాల పాటు క్రమబద్ధమైన యోగా వల్ల వీర్యంపై కలిగే ఆక్సిడేటివ్ ఒత్తిడిని, వీర్యం నాణ్యతను, డీఎన్ఏ విచ్ఛిత్తిని విశ్లేషించారు. రోజూ గంట పాటు క్రమం తప్పకుండా యోగా, శ్వాస సంబంధిత వ్యాయామాలు, ధ్యానం, విశ్రాంతి తీసుకొనే పద్ధతుల్లో పాల్గొన్న వారిలో సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపడినట్టు కనిపించిందని వివరించారు.