న్యూఢిల్లీ: పురుషుల్లో ఉండే వై క్రోమోజోమ్(Y Chromosomes)కు చెందిన సంపూర్ణ జన్యుక్రమాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. పురుషుల్లో వంధ్యత్వంతో పాటు ఇతర ఆరోగ్య కారణాలకు చెందిన లోపాలను ఆ సీక్వెన్సింగ్ ద్వారా పసికట్టనున్నారు. వై క్రోమోజోమ్‌లో ఉండే జన్యు నిర్మాణాలకు చెందిన స్టడీ 60 ఏళ్ల క్రితమే మొదలైంది. అయితే జన్యు సీక్వెన్సింగ్‌లో అనేక కష్టాలు ఎదురయ్యాయి. టెలోమేరి టు టెలోమేరి గ్రూపునకు చెందిన సుమారు 100 మంది శాస్త్రవేత్తలు ఆ జన్యు నిర్మాణానికి చెందిన సీక్వెన్సింగ్‌ను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని నేచర్ పత్రికలో ప్రచురించారు.
ఓ ఏడాది క్రితం వరకు కూడా మానవ వై క్రోమోజోమ్‌లో ఉన్న సగం జన్యు నిర్మాణం ఎవరికీ తెలియదని, కానీ ఇప్పుడు ఆ జన్యు సరళి మొత్తం తెలిసిపోయిందని కాలిఫోర్నియా వర్సిటీ స్కాలర్ మోనికా సెచోవా తన పేపర్లో రాశారు. ఓ దశలో సీక్వెన్సింగ్ వీలు కాదేమో అన్న ఆలోచనలో ఉండేవాళ్లమని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు.
మనుషుల్లో రెండు సెక్స్ క్రోమోజోమ్‌లు ఉంటాయన్న విషయం తెలిసిందే. పురుషుల్లో ఒకటి ఎక్స్, మరొకటి వై క్రోమోజోమ్ ఉంటాయి. ఇక ఆడవాళ్లలో రెండు ఎక్స్ క్రోమోజోమ్‌లు మాత్రమే ఉంటాయి. అయితే వై క్రోమోజోమ్‌ను సీక్వెన్సింగ్ చేయడం వల్ల.. ఆ క్రోమోజోమ్ లోపం వల్ల కలిగే రుగ్మతలపై స్టడీ చేసే వీలు అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆరోగ్యం, సుదీర్ఘ జీవనానికి సంబంధించి వై క్రోమోజోమ్ చాలా అవసరం అని బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ కెన్నెత్ వాల్ష్ తెలిపారు. క్యాన్సర్‌ను నివారించే జన్యువులను వై క్రోమోజోమ్‌లో గుర్తించామని వాల్ష్ చెప్పారు.