చెన్నై: చోరీ కోసం కోత మిల్లులోకి వచ్చినట్లు అనుమానించిన అక్కడి కార్మికులు ఒక వ్యక్తిని చెట్టుకు కట్టేశారు. ఆపై దారుణంగా కొట్టి చంపారు. తమిళనాడులోని తిరుచ్చిలో ఈ సంఘటన జరిగింది. మదురై హైవేలోని మణిగండం వద్ద ఉన్న ఆశాపురా సా మిల్లులో పలు రాష్ట్రాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు. నైజీరియా, మయన్మార్ నుంచి దిగుమతి అయ్యే నాణ్యమైన కలపతో ఫర్నిచర్, గృహోపకరణాలను ఇక్కడ తయారు చేస్తారు.
కాగా, శనివారం ఉదయం ఒక వ్యక్తి ఆ మిల్లులోకి ప్రవేశించడాన్ని అస్సాంకు చెందిన కార్మికులు గమనించారు. చోరీ కోసం వచ్చినట్లు అనుమానించి అతడ్ని పట్టుకుని ఒక చెట్టుకు కట్టేశారు. ఆ తర్వాత దారుణంగా కొట్టి చంపారు. దొంగను పట్టుకున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు ఆ మిల్లు వద్దకు వచ్చారు. చెట్టుకు కట్టేసిన వ్యక్తిని పరిశీలించగా అతడు చనిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తి మెడ, ఛాతి, చేతులు, ప్రైవేట్ భాగంపై గాయాలున్నట్లు పోలీసులు గమనించారు. మృతుడ్ని తువ్వకుడికి చెందిన చక్రవర్తిగా గుర్తించారు. అతడ్ని దారుణంగా కొట్టి చంపిన అస్సాంకు చెందిన ఫైజల్ షేక్, మఫ్జుల్ హుక్తోపాటు సా మిల్లు యజమాని ధీరేందర్పై హత్య సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.