UP Assembly Polls | ఇప్పుడు దేశంలో ఏ ఎన్నిక జరిగినా మనీదే పవర్.. డబ్బున్న వారే విజయం సాధిస్తారు. దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పే ఉత్తరప్రదేశ్‌లోనూ డబ్బు వెదజల్లే వారిదే గెలుపు.. డబ్బులు కుమ్మరించి గెలుపొందడంతోపాటు ఎన్నికయ్యాక గౌరవ ఎమ్మెల్యేలు భారీగా సంపద కూడబెట్టుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. అందులోనూ మహిళా ఎమ్మెల్యేల సంపద చూస్తే కండ్లు జిగేల్మంటాయి. యూపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో యూపీ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించిన అంశాలు చూస్తే మన కండ్లు బైర్లు కమ్ముతాయి.
ఉత్తరప్రదేశ్‌లో పురుష ఎంపీలు, ఎమ్మెల్యేల కంటే మహిళా సభ్యుల సంపద సగటున రెండు రెట్ల పైమాటే. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మహిళా అభ్యర్థి, ఎమ్మెల్యేగా ఎన్నికైన నేత తర్వాత సంపాదించిన సంపద, ఆస్తులు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. రాష్ట్రంలోని 403 మంది ఎమ్మెల్యేల్లో 396 మంది ఆస్తులు, నేరపూరిత చరిత్ర తదితర అంశాలను యూపీ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ విశ్లేషించింది. సగటున పురుష ఎంపీలు, ఎమ్మెల్యేల ఆస్తులు రూ.4.21 కోట్లు. మహిళా ఎంపీలూ ఎమ్మెల్యేల ఆస్తులు రూ.8.31 కోట్లు. యూపీలో ఎంపీలు, ఎమ్మెల్యేల్లో అత్యధిక సంపద గల మహిళా ప్రతినిధుల గురించి తెలుసుకుందాం..
2004 నుంచి పోటీ చేసిన 21,229 మంది అభ్యర్థుల్లో 1641 మంది మహిళల ఆస్తులు కూడా రెండు రెట్లు. మొత్తం ఎమ్మెల్యేల ఆస్తుల్లో ఇది 8 శాతం. సగటున మహిళా అభ్యర్థుల ఆస్తులు రూ.1.40 కోట్లు. మహిళా అభ్యర్థుల ఆస్తులు రూ.2.19 కోట్లు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన యూపీలో పోటీ చేసే అభ్యర్థుల్లో పురుషుల కంటే మహిళ ఆస్తులే ఎక్కువ.