న్యూఢిల్లీ: దేశంలో కేవలం మూడు శాతం మంది మహిళలు మాత్రమే వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. అదే సమయంలో 73 శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు లేదా ఉద్యోగం, విద్య, శిక్షణలో లేని వర్గం(నీట్)లో ఉన్నారని నీతి ఆయోగ్ తాజా నివేదిక పేర్కొంది. వికసిత్ భారత్ @2047 లక్ష్యంలో భాగంగా నైపుణ్యాభివృద్ధి విధానాలను పునఃసమీక్షించే అంశంపై రూపొందించిన ఈ నివేదిక, 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే ఆశయానికి సంబంధించి శ్రమశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ఒక కీలక సవాలుగా గుర్తించింది. దేశంలోని నైపుణ్యాభివృద్ధి వ్యవస్థ అందరికీ ఒక రకమైన విధానాన్ని అనుసరించే పద్ధతిని విడనాడి అభ్యాసకులు, కార్మికులు ఎదుర్కొంటున్న విభిన్న అడ్డంకులను పరిగణనలోకి తీసుకోవాలని ఈ నివేదిక పేర్కొంది. మహిళా ఉద్యోగులకు ఆర్థిక సహాయం లభ్యత వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది.