భువనేశ్వర్: సహజీవనం చేస్తున్న వ్యక్తిని కొందరితో కలిసి మహిళ కిడ్నాప్ చేసింది. అతడి కుటుంబానికి ఫోన్ చేసి పది లక్షలు డిమాండ్ చేసింది. (Woman Kidnaps Live-In Partner) ఆ వ్యక్తి కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ మహిళతోపాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ సంఘటన జరిగింది. 28 ఏళ్ల సోమనాథ్ స్వైన్, 23 ఏళ్ల ప్రాప్తి శర్మ గత మూడేళ్లుగా జర్పాడాలో సహజీవనం చేస్తున్నారు. అయితే ఆమెకు మరో వ్యక్తితో సంబంధం ఉందన్న అనుమానంతో మార్చి 30న వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా ప్రాప్తిని సోమనాథ్ కొట్టాడు. ఈ నేపథ్యంలో ఆమె తన అక్కకు ఈ విషయం చెప్పి విలపించింది.
కాగా, ప్రాప్తి అక్క ఈ సంగతిని తన ప్రియుడు ఆకాష్‌కు చెప్పింది. దీంతో తన అనుచరులైన ముగ్గురితో కలిసి రెండు కార్లలో సోమనాథ్ ఇంటికి చేరుకున్నారు. అతడ్ని కిడ్నాప్ చేసి ఒక హోటల్లో బంధించారు. సోమనాథ్ సోదరికి ఫోన్ చేసి పది లక్షలు డిమాండ్ చేశారు. ఆందోళన చెందిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోదరుడితో సహజీవనం చేస్తున్న ప్రాప్తిపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది.
మరోవైపు కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ ఫోన్ కాల్స్ ఆధారంగా ఆరు గంటల్లో నిందితులను ట్రేస్ చేశారు. వారి చెర నుంచి సోమనాథ్‌ను విడిపించారు. ప్రాప్తి, మరో నలుగురిని అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కోసం వినియోగించిన రెండు కార్లు, 8 మొబైల్ ఫోన్లు, కర్ర వంటివి వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.