Over Dowry | హరిద్వార్: అదనపు కట్నం చెల్లించలేదనే కోపం తో అత్తింటివారు కోడలికి హెచ్ఐవీ ఇన్ఫెక్టెడ్ ఇంజెక్షన్‌ను ఇచ్చారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ ప్రాంతానికి చెందిన అభిషేక్ వురపు సచిన్‌కు సోనాల్ సైనీని ఇచ్చి 2023లో వివాహం చేశారు. ఓ కారు, రూ.15 లక్షల నగదు వరునికి కట్నంగా ఇచ్చారు. కొంత కాలం తర్వాత స్కార్పియో కారు, రూ.25 లక్షలు కట్నంగా ఇవ్వాలని వరుని బంధువులు డిమాండ్ చేశారు.
అందుకు సోనాల్ తండ్రి అంగీకరించలేదు. దీంతో అభిషేక్ బంధువులు సోనాల్‌కు హెచ్ఐవీ ఇన్ఫెక్టెడ్ ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. వైద్య పరీక్షల్లో ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. ఆమె భర్త అభిషేక్‌కు హెచ్ఐవీ నెగెటివ్ అని తెలిసింది. దిగ్భ్రాంతికి గురైన సోనాల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కానీ పోలీసులు పట్టించుకోలేదు. బాధితులు వెంటనే కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు గంగోహ్ కొత్వాలి పోలీసులు కేసు నమోదు చేశారు. సోనాల్పై దాడి, హత్యాయత్నం, వరకట్న వేధింపులకు పాల్పడినట్లు అభిషేక్‌తోపాటు అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.