సోమవారం 30 మార్చి 2020
National - Feb 12, 2020 , 02:31:16

కేజ్రీవాల్‌కు అభినందనల వెల్లువ

కేజ్రీవాల్‌కు అభినందనల వెల్లువ

ఢిల్లీలో అఖండ విజయం సాధించిన ఆప్‌ అధినేత అర్వింద్‌ కేజ్రీవాల్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల అధినేతలు, పలువురు ప్రముఖులు కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


ప్రతిధ్వనించే, స్ఫూర్తిదాయక విజయం సాధించిన కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు. దేశంలో సమగ్ర రాజకీయాలకు ఇదో ముందస్తు సూచిక. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, నిరంతర మత ధ్రువీకరణకు ప్రజల ప్రతిచర్య ఈ విజయం.        

 - పినరయి విజయన్‌, కేరళ ముఖ్యమంత్రి 


అతిపెద్ద మెజారిటీతో మరోసారి విజయం సాధించిన కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు. ఇది ప్రజాస్వామ్య విజయం. ఎవరతై హామీలను నెరవేరుస్తారో వారికే బహుమతి. విభజన రాజకీయాలు, ద్వేషపూరిత ప్రసంగాలు చేసే నాయకులు దీనినుంచి స్ఫూర్తి పొందాలి.

- మమత, పశ్చిమబెంగాల్‌ సీఎం


ఢిల్లీ ఫలితాలు నన్ను పెద్దగా ఆశ్చర్యపరచలేదు. బీజేపీ మతపూరిత, విభజిత రాజకీయాలను ఢిల్లీ ప్రజలు తిరస్కరించారు. ఇది ఢిల్లీకి మాత్రమే పరిమితమైన తీర్పుకాదు. వివిధ రాష్ర్టాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న మూడ్‌ను ఢిల్లీ ప్రజలు ప్రతిబింబించారు. దేశంలో మార్పును కోరే పవనాలు వీస్తున్నాయనడానికి  ఈ ఫలితాలు సంకేతం.               - శరద్‌ పవార్‌, ఎన్సీపీ అధ్యక్షుడు


ఢిల్లీ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. తమ కనీస అవసరాలు తీర్చే ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యుత్‌, నీళ్లు, విద్య, ఆరోగ్యం అంశాలను అందుబాటులోకి తెచ్చినందుకే ఆప్‌ విజయానికి ఢిల్లీ ఓటర్లు బాటలు వేశారు. ఇవే అంశాలపై పనిచేసిన టీఆర్‌ఎస్‌ పార్టీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు.                                           - బోయినపల్లి వినోద్‌ కుమార్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

ఢిల్లీలో కేజ్రీవాల్‌ విజయం మతరాజకీయాలను తుడిచిపెట్టి.. అభివృద్ధి రాజకీయాలకు నిదర్శనంగా నిలిచింది. ఆమ్‌ఆద్మీపార్టీ అధినేతకు శుభాకాంక్షలు. సమాఖ్య హక్కులు, ప్రాంతీయ ఆకాంక్షలు.. దేశ ప్రయోజనాలను మరింత బలపరుస్తాయి.

- ఎంకే స్టాలిన్‌, డీఎంకే అధ్యక్షుడు


నియంతృత్వ భావజాలం ఎప్పటికీ హృదయాలను గెలుచుకోలేదని ఢిల్లీ ప్రజలు నిరూపించారు. అభివృద్ధి తెలిసిన నాయకుడు కేజ్రీవాల్‌. ఆయనను పలువురు ఉగ్రవాదిగా ముద్ర వేసినందుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ప్రాంతీయ పార్టీల అవసరాన్ని సమర్థించారు. ఢిల్లీ ఓటర్లకు, ఆప్‌కు  శుభాకాంక్షలు. 

- హెచ్‌డీ కుమారస్వామి, జేడీ(ఎస్‌) నేత, కర్ణాటక మాజీ  సీఎం


బీజేపీ అనుసరిస్తున్న ద్వేషపూరిత, హింసాత్మక రాజకీయాలను ఢిల్లీ ప్రజలు తిరస్కరించారు. ఆ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పారు. భారీ విజయం సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు అభినందనలు. 

- సీతారాంఏచూరి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి


logo