న్యూఢిల్లీ: తెలంగాణలో ధాన్యం సేకరణపై ఇవాళ రాజ్యసభలో ప్రశ్న వేశారు. ఎంపీ కేశవరావు దీనిపై మాట్లాడారు. ఎవర్నీ ఇబ్బంది పెట్టే ప్రశ్న వేయడంలేదని, చాలా సూటిగా ఓ ప్రశ్న వేస్తున్నానని, తెలంగాణ నుంచి మొత్తం ధాన్యాన్ని సేకరించేందుకు కేంద్రం సుముఖంగా ఉందా లేదా అని కేశవరావు ప్రశ్నించారు. అది ఎటువంటి ధాన్యమైనా సేకరించాలన్నారు. తెలంగాణ నుంచి ప్రతి గింజను కొంటామని ఓ కేంద్ర మంత్రి చెప్పారని, ఆ ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉందా లేదా అని ఆయన అడిగారు. గత ఏడాది 94 లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొన్నదని, కానీ ఈ ఏడాది కేవలం 19 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్లు కేశవరావు అన్నారు. గత ఏడాది తీసుకున్నంత ఈ ఏడాది తీసుకుంటారా అని కేంద్రాన్ని కేశవరావు అడిగారు. రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం 60 శాతం పెరిగిందన్నారు.
దీనిపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంత్రి పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. ప్రతి ఏడాది పంట సేకరణను క్రమంగా పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ధాన్య సేకరణను పెంచామని, తెలంగాణలోనూ ప్రొక్యూర్మెంట్ను పెంచినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఖరీఫ్ సీజన్లో 50 లక్షల టన్నులు ఇస్తామని చెప్పారని, కానీ కేవలం 32.66 లక్షల టన్నులు మాత్రమే ఇచ్చారన్నారు. రబీ సీజన్లో ఎక్కువగా బాయిల్డ్ రైస్ ఉంటుందని, ఒకవేళ మీరు బాయిల్డ్ రైస్ ప్రొక్యూర్ చేస్తే, ఎంత చేస్తారో చెప్పాలని కేశవరావు ప్రశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. పెండింగ్‌లో ఉన్న ధాన్యాన్ని సరఫరా చేయాలని మంత్రి గోయల్ అన్నారు.
టీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి కూడా మాట్లాడారు. రబీలో పారాబాయిల్డ్ రైస్ మాత్రమే ఎక్కువగా ఉత్పత్తి అవుతోందని, ఆ రైస్‌ను కొంటారా కొనరా అని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. తెలంగాణలో పండిన పంట అంశంపై కేంద్రానికి డౌట్ ఉందని, కానీ ఫిజికల్ వెరిఫికేషన్ ద్వారా 99 శాతం ఆ డౌట్ క్లియరైందన్నారు. రబీ పంట కోసం తెలంగాణలో నాట్లు వేయడం మొదలయ్యాయని, కానీ ఆ రైస్ కొంటారా లేదా అన్న అంశాన్ని మార్చిలో చెబుతామని కేంద్ర మంత్రి చెప్పడం శోచనీయంగా ఉందన్నారు. రబీలో పండే పారాబాయిల్డ్ రైస్‌ను ప్రొక్యూర్ చేస్తారా లేదా చెప్పాలని సురేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఒడిశాకు చెందిన ఎంపీ సుస్మిత్ పాత్ర కూడా దీనిపై మాట్లాడారు. పారాబాయిల్డ్ రైస్‌ను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొంటుందా కొనదా అని ఆయన అడిగారు. ఎందుకుంటే ఒడిశాలో కూడా ఎక్కువ శాతం పారాబాయిల్డ్ రైస్‌ను ఉత్పత్తి చేస్తారన్నారు. ఎఫ్‌సీఐ ఆ ధాన్యాన్ని కొనేలా చేయాలన్నారు.