Sita – Akbar | పశ్చిమ బెంగాల్ లోని శిలిగుడి సఫారీ పార్కులోని ఒక ఎన్క్లోజర్లో ఉంచిన మగ సింహానికి అక్బర్, ఆడ సింహానికి సీత అనే పేరు పెట్టడం వివాదంగా మారింది. దీనిపై వీహెచ్పీ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కలకత్తా హైకోర్టు జల్పాయీగూడీ సర్క్యూట్ బెంచ్.. ఆ రెండు సింహాల పేర్లు మార్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మౌఖికంగా సూచించింది.
త్రిపురలోని సిపాహిజాల జులాజికల్ పార్కు నుంచి అక్బర్, సీత అనే పేర్లు గల మగ, ఆడ సింహాలను ఇటీవలే శిలిగుడి సఫారీ పార్కుకు తెచ్చి, వాటిని ఒకే ఎన్క్లోజర్లో పెట్టారు. సింహాలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అటవీశాఖ అధికారులే ఈ పేర్లు పెట్టారని, అవి హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని వీహెచ్పీ తన పిటిషన్లో పేర్కొంది. వెంటనే ఆడ సింహం పేరు మార్చాలని డిమాండ్ చేయడంతోపాటు హైకోర్టును ఆశ్రయించింది.
ఈ వివాదంపై జస్టిస్ సౌగతా భట్టాచార్య సారధ్యంలోని సింగిల్ బెంచ్ తాజాగా విచారణ జరిపింది. ఈ వివాదానికి తెర దించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అందుకోసం సింహాల పేర్లు మార్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన ఏఏజీ వాదిస్తూ.. ఆ పేర్లు త్రిపురలో పెట్టారని, ఇప్పటికే వాటి పేర్లు మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తున్నదన్నారు.