చెన్నై: డీఎంకే ఎంపీ ఎస్ జగద్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులకు ఈడీ రూ.908 కోట్ల జరిమానా విధించింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై 2020 సెప్టెంబరులో దర్యాప్తు నిర్వహించినట్లు ఈడీ నోటిఫికేషన్ తెలిపింది. జగద్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న రూ.89.19 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. వీరు విదేశీ సంస్థల్లో అక్రమంగా పెట్టుబడులు పెట్టారని ఆరోపిస్తూ 2021 డిసెంబరులో ఈడీ ఫిర్యాదును దాఖలు చేసింది. జగద్రక్షకన్ 2017లో సింగపూర్‌లోని ఓ బూటకపు కంపెనీలో రూ.42 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టారని ఆరోపించింది.
న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌కు నేటి రాత్రి 8 గంటల నుంచి వచ్చే నెల 2న ఉదయం 6 గంటల వరకు టెక్నికల్ మెయింటెనెన్స్ జరుగుతుంది. ఈ సమయంలో దీని సేవలు ప్రజలకు అందుబాటులో ఉండవు. ఈ నెల 30వ తేదీకి షెడ్యూల్ అయిన అన్ని అపాయింట్మెంట్లను అధికారులు రద్దు చేశారు. రీషెడ్యూల్డు అపాయింట్‌మెంట్స్‌కు సంబంధించిన వివరాలు దరఖాస్తుదారులకు ఎస్ఎంఎస్ ద్వారా నోటిఫికేషన్‌ను పంపిస్తారు. ఈ సమయంలో ఎంఈఏ/ఆర్పీఓ/బీఓఐ/ఐఎస్పీ/డీఓపీ/పోలీసు అధికారులకు కూడా ఈ పోర్టల్ సేవలు అందుబాటులో ఉండవు.