న్యూఢిల్లీ, నవంబర్ 26: కోట్ల కొద్దీ అస్తి. పైగా ఒక్కడే సంతానం. మరొకరెవరైనా అయితే విలాసవంతంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపేస్తారు. కానీ వెన్ అజాన్ సిరిపన్నో తీరే వేరు. మలేషియాకు చెందిన బిలియనీర్ ఆనంద్ కృష్ణన్కు ఈయన ఏకైక సంతానం. అయినా కోట్ల ఆస్తిని త్యజించి బౌద్ధ సన్యాసిగా మారిపోయి బుద్ధుని బోధనలు ప్రచారం చేస్తూ సామాన్య జీవితం గడుపుతున్నాడు. ఏకేగా పిలిచే అతని తండ్రి ఆనంద్ కృష్ణన్ రూ.40 వేల కోట్ల ఆస్తితో మలేషియాలోనే మూడో అతి ధనవంతుడుగా పేరొందాడు. విదేశాల్లో చదువుకున్న అజాన్ 18 ఏండ్ల నుంచి ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేశాడు. కుమారుడి మార్గాన్ని తండ్రి కూడా గౌరవించాడు. 18 ఏండ్ల వయసులో అతడి తల్లి కుటుంబానికి నివాళి అర్పించడానికి థాయ్లాండ్ వెళ్లాడు. అక్కడ తాత్కాలికంగా ప్రారంభమైన ప్రయాణం ఆయన జీవన గమనాన్ని నిర్దేశించింది. తర్వాత సన్యాసిగా మారి ఆధునిక సిద్ధార్థునిగా రూపాంతరం చెందాడు. మిగిలిన బౌద్ధ భిక్షవుల్లాగ ఆయన కూడా వారితో సామాన్య జీవితం గడుపుతూ బౌద్ధ, థాయ్ అటవీ సంప్రదాయ బోధనలు ప్రచారం చేస్తూ సాదాసీదాగా జీవిస్తున్నారు. బౌద్ధమత సూత్రాలలో కుటుంబ ప్రేమ ఒక్కటి కాబట్టి అప్పుడప్పుడు తన తండ్రిని కలిసి ఆయనతో కొంతకాలం గడుపుతారు.