న్యూఢిల్లీ:
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా కొవాగ్జిన్‌కు ( Covaxin vaccine ) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తింపు దక్కింది. దాంతో భారత్ మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి లభించినట్లయ్యింది. కొవాగ్జిన్ టీకాను అన్ని విధాలుగా పరీక్షించిన WHO టెక్నికల్ అడ్వైజరీ కమిటీ.. ఏ లోపాలు లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది. భారత్‌లో గత కొన్ని నెలలుగా 18 ఏండ్లు పైబడిన వారికి కొవాగ్జిన్ టీకా ఇస్తున్నారు.
WHOకు చెందిన టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ కొవాగ్జిన్‌కు అనుమతి ఇచ్చే విషయమై గతంలోనే అక్టోబర్ 26న సమావేశమైంది. ఆ సమావేశంలో టీకాకు సంబంధించి భారత్ బయోటెక్ ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి అదనపు సమాచారం కావాలని కోరింది. భారత్ బయోటెక్ సంబంధిత సమాచారం అందజేయడంతో ఇవాళ మరోసారి భేటీ అయ్యింది. టీకా తయారీదారు ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెంది ఆమోదం తెలిపింది. కాగా, కొవాగ్జిన్ టీకా కరోనా వైరస్ నుంచి 77.8 శాతం, డెల్టా వేరియంట్ నుంచి 65.2 శాతం రక్షణ కల్పిస్తుంది.