Wrestlers | న్యూఢిల్లీ, జూన్ 11: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై చేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఏవైనా ఉంటే ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు మహిళా రెజ్లర్లను కోరినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులు, అసభ్యకర ప్రవర్తనకు సంబంధించిన ఫొటోగ్రాఫ్‌లు, ఆడియోలు, వీడియో, వాట్సాప్ చాట్ ఆధారాలు సమర్పించాలని పొలీసులు ఇద్దరు మహిళా రెజ్లర్లకు సీఆర్పీసీ సెక్షన్ 91 కింద నోటీసులు ఇచ్చారు. బ్రిజ్‌భూషణ్ కౌగిలించుకొన్నాడనే ఆరోపణలకు ఫొటో ఆధారాలు ఇవ్వాలని కూడా పోలీసులు నోటీసుల్లో సూచించినట్టు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. పోలీసుల నోటీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ‘ఇకపై లైంగిక వేధింపులకు గురయ్యే బాధితులు వారు ఎదుర్కొనే దాడులను రికార్డు చేసేందుకు కెమెరాలను సిద్ధంగా ఉంచుకోవాలా? లేక రికార్డు చేసేందుకు ఎవరైనా ఉండాలా?’ అని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రశ్నించారు.
బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా తమ వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు ఇచ్చామని ఓ రెజ్లర్ తెలిపినట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొన్నది. ఆరోపణలకు సంబంధించిన తేదీలు, సమయాలు, డబ్ల్యూఎఫ్ఐ కార్యాలయాన్ని సందర్శించిన వ్యవధి, రూమ్మేట్స్, ఇతర సాక్షుల గుర్తింపునకు సంబంధించిన వివరాలు కూడా సమర్పించాలని రెజ్లర్లను పోలీసులు కోరినట్టు మీడియా సంస్థలు నివేదించాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాక బెదిరింపు కాల్స్ వస్తున్నాయనే దానిపై తగిన ఆధారాలు ఇవ్వాలని మరో రెజ్లర్, ఆమె బంధువుకు పోలీసులు మరో నోటీసు ఇచ్చినట్టు సమాచారం.
ప్రభుత్వం ఉన్నది ప్రజలకు సహాయ పడటానికే తప్ప వారిని వేధించడానికి కాదని రెజ్లర్ వినేశ్ ఫోగట్ విమర్శించారు. సంయుక్త్ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తమ డిమాండ్ల సాధనకు పంజాబ్‌లోని పాటియాల జిల్లాలో రైతులు చేస్తున్న ఉద్యమానికి ఆమె మద్దతు తెలిపారు. ఆదివారం రైతుల ఆందోళనలో పాల్గొన్న ఆమె డిమాండ్ల సాధనకు రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి రావడం దేశానికి మంచిది కాదన్నారు.