న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) సూత్రాల ఆధారంగా కొత్త పార్టీని ఏర్పాటు చేస్తామని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (DSGMC) అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా తెలిపారు. ఢిల్లీ సిక్కుల సమస్యలను తామే పరిష్కరించుకుంటామని, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కొత్త పార్టీ ఏర్పాటు నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని, ఇది చారిత్రాత్మకమని అన్నారు.
కాగా, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో కలిసి ఉన్నప్పుడు తమ సమస్యలపై నిర్ణయాలు తీసుకోవడంలో రాజకీయ సవాళ్లను ఎదుర్కొన్నట్లు హర్మీత్ సింగ్ విమర్శించారు. ఈ నేపథ్యంలో సిక్కుల మతపరమైన సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులంతా కలిసి నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్ఏడీ తనను బహిష్కరించవచ్చని ఆయన అన్నారు.
మరోవైపు హర్మీత్ సింగ్ కల్కాను, శిరోమణి అకాలీదళ్ (SAD) బహిష్కరించింది. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (DSGMC) అధ్యక్షుడిగా ఉన్న ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపించింది. కాగా, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన బటిండా మాజీ ఎమ్మెల్యే సరూప్ చంద్ సింగ్లా, బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.