Pandit Ravishankar : బంగ్లాదేశ్ (Bangladesh) లో ఇస్కాన్ (ISKCON) కు చెందిన చిన్మయి కృష్ణదాస్ ప్రభు (Chinmoy Krishna Das Prabhu) ను ఢాకా పోలీసులు అరెస్ట్ చేయడంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్ (Pandit Ravi Shankar) స్పందించారు. పొరుగు దేశమైన బంగ్లాదేశ్ ప్రధాని (Bangladesh PM) మహ్మద్ యూనస్ (Mohammad Yunus) ఇలా చేస్తాడని తాను అస్సలు ఊహించలేదని ఆయన అన్నారు.
‘చిన్మయి కృష్ణదాస్ ఒక ఆధ్యాత్మిక గురువు. ఆయన దగ్గర ఆయుధాలు లేవు. ఆయన దగ్గర తుపాకులు లేవు. ఆయన తన ప్రజల బాగోగులు చూసుకుంటున్నారు. ఆయన ప్రజల హక్కులకు మద్దతుగా నిలిచారు. మైనారిటీలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అలాంటి వ్యక్తిని బంగ్లాదేశ్ ప్రధాని అరెస్ట్ చేయించి ఉండకూడదు’ అని పండిట్ రవిశంకర్ వ్యాఖ్యానించారు.
మత గురువులను అరెస్ట్ చేయించడం ప్రభుత్వాలకుగానీ, ప్రజలకు గానీ, దేశానికి గానీ మంచిది కాదని, పైగా బంగ్లాదేశ్‌కు చెడ్డపేరు తెచ్చి పెడుతుందని పండిట్ రవిశంకర్ అభిప్రాయపడ్డారు. శాంతి కోసం కృషిచేసి నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న బంగ్లాదేశ్ ప్రధాని మహ్మద్ యూనస్ ఇలా ఒక మత గురువును అరెస్ట్ చేయిస్తారని అస్సలు అనుకోలేదన్నారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టేవారిని వదిలేసి, హక్కుల కోసం పోరాడే వారిపై చర్యలకు దిగడం కరెక్టు కాదని రవిశంకర్ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌కు ఉదారవాద దేశంగా మంచి పేరుందని, ఆ దేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్నదని, అలాంటి దేశాన్ని ప్రధాని యూనస్ వెనక్కి తీసుకుపోదలుచుకున్నారా..? అని ఆయన ప్రశ్నించారు. చిన్మయి కృష్ణ దాస్‌ను విడిచి పెట్టాలని భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.