Supreme Court | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో ఎవరైనా సభ్యులు అవినీతికి పాల్పడితే వారిని విచారించే విషయంపై సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపులేవీ ఇచ్చేదిలేదని కోర్టు తేల్చి చెప్పింది. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగాలు చేసేందుకు, ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే ఆయా సభ్యులకు రాజ్యాంగపరంగా రక్షణ కల్పించలేమని స్పష్టంచేసింది.
ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. 1998 నాటి పీవీ నరసింహారావు సర్కారు వర్సెస్ సీబీఐ కేసు తీర్పును న్యాయస్థానం కొట్టివేసింది.

Bribe
కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
ఏమిటీ కేసు?
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యే సీతా సొరేన్ 2012 రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం తీసుకొని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తొలుత జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకు వెళ్లారు.
ఇద్దరి నుంచి చివరకు ఏడుగురికి..
చట్టసభల్లో ప్రజాప్రతినిధుల లంచాల అంశం ఎంతో సంక్లిష్టమైంది. దీనిపై తీర్పును వెలువరించడానికి ఏకంగా నాలుగు సార్లు సుప్రీంకోర్టు ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనాలను ఏర్పాటు చేయవలసివచ్చింది. సీతా సొరేన్ కేసును హైకోర్టు తిరస్కరించడంతో ఆమె విజ్ఞప్తి మేరకు ఇద్దరు సభ్యుల సుప్రీం ధర్మాసనం 2014లో విచారణ జరిపింది. అయితే, కేసు ప్రాముఖ్యం దృష్ట్యా దీన్ని త్రిసభ్య ధర్మాసనానికి సిఫారసు చేసింది. దీంతో 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటైంది. చివరకు ఈ కేసును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేశారు.
అనంతరం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా 1998నాటి పీవీ నరసింహారావు సర్కారు వర్సెస్ సీబీఐ కేసులో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. విస్తృత ధర్మాసనం విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది.

1998 నాటి కేసులో ఏం జరిగింది?
1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో జేఎంఎం ఎంపీగా ఉన్న శిబుసొరేన్ సహా అదే పార్టీకి చెందిన మరో ఐదుగురు ఎంపీలు లంచాలు తీసుకుని పీవీ సర్కారుకు అనుకూలంగా ఓటు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరి మద్దతుతో మైనార్టీలో ఉన్నప్పటికీ 265 ఓట్లతో పీవీ ప్రభుత్వం గట్టెక్కింది. అయితే, జేఎంఎం ఎంపీలు లంచాలు తీసుకొన్నారన్న వ్యవహారం దుమారం రేపడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే, సొరేన్ బృందానికి ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు 1998లో తీర్పును వెలువరించింది. ప్రజాప్రతినిధులకు లంచం కేసుల విచారణ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొన్న ధర్మాసనం ఆ కేసును కొట్టేసింది.
సుప్రీం తాజా తీర్పుతో ఏం జరుగనున్నది?
చట్టసభ సభ్యులకు సంబంధించి ఓటుకు నో టు కేసులు పారదర్శక ఎన్నికల ప్రక్రియకు ఓ వి ఘాతంలా మారాయి. సుప్రీం తీర్పు రాక మునుపు లంచం కేసుల్లో చట్టసభ సభ్యులను విచారించే అవకాశం ఉండేది కాదు. అయితే, రాజ్యాంగపరంగా వారికి ఉన్న రక్షణను కోర్టు తాజాగా తొలగించడంతో.. ఓటు కోసం లేదా ప్రశ్నలు వేయడానికి లేదా ప్రసంగించడానికి లంచం తీసుకొన్న చట్టసభసభ్యుడు అవినీతి నిరోధక చట్టం కింద విచారణను ఎదుర్కోవాల్సిందే.
గొప్ప తీర్పు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, మార్చి 4: జేఎంఎం అవినీతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చాలా గొప్పగా ఉందని ప్రధాని మోదీ కొనియాడారు. స్వచ్ఛమైన రాజకీయాల్ని పెంపొందిస్తుందని, రాజకీయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతుందని ప్రధాని అన్నారు. లంచం కేసుల్లో చట్ట సభ్యులకు ఎలాంటి మినహాయింపు లేదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. తీర్పును ఆహ్వానిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చట్టాన్ని సరిదిద్దటం కోరదగినదని, న్యాయ వ్యవస్థ ఈ పని ఎప్పుడో చేయాల్సిందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఒక సింపుల్ పాయింట్ చాలా ఏండ్లుగా పెండింగ్లో ఉండిపోయింది. న్యాయ వ్యవస్థ నేడు దానికి ముగింపు పలికింది’ అని అన్నారు.