న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని వృందావన్‌లో ఉన్న ఆధ్యాత్మిక గురువు, ప్రవచనకర్త ప్రేమానంద్ మహారాజ్‌కు చెందిన రాధా కేళీ కుంజ్ ఆశ్రమాన్ని క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) దంపతులు రెగ్యులర్‌గా విజిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రమానంద్ ఆశ్రమానికి కోహ్లీని రప్పించేందుకు 5 కోట్లు ఖర్చు చేసినట్లు శ్రీ కృష్ణ జన్మభూమి సంఘర్ష్ నాశ్ అధ్యక్షుడు ఫలహారి మహారాజ్ దినేశ్ శర్మ ఆరోపించారు. కోహ్లీ రాక కోసం 5 కోట్లు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ క్రికెటర్ ప్రతినిధి స్పందించారు. ప్రేమానంద్ పాపులారిటీ మరింత పెంచేందుకు ఆ ఖర్చు చేసినట్లు ఫలహారి మహారాజ్ ఆరోపించడంతో కోహ్లీ ప్రతినిధి రియాక్ట్ అయ్యారు. కోహ్లీని ఉద్దేశిస్తూ దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని, అవన్నీ తప్పుడు ఆరోపణలు అని, నిరాధారమైనవి అని ప్రతినిధి పేర్కొన్నారు. ప్రేమానంద్ మహారాజ్ పట్ల కోహ్లీకి స్వచ్ఛమైన భక్తి, నమ్మకం ఉన్నాయని, ఆ ఉద్దేశంతోనే కోహ్లీ ఆశ్రమాన్ని విజిట్ చేస్తుంటారని ప్రతినిధి తెలిపారు. కోహ్లీపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మీడియా కూడా ఈ అంశం పట్ల సంయమనాన్ని పాటించాలన్నారు. వాస్తవాలను నిర్దారణ చేసుకుని రిపోర్టింగ్ చేయాలని సూచించారు. అయితే విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్కా శర్మకు ఆశ్రమం నుంచి డబ్బు అందినట్లు ఎటువంటి ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ లేవు.
కోహ్లీ దంపతులు రెగ్యులర్‌గా రాధా కేళీ కుంజ్ ఆశ్రమాన్ని విజిట్ చేస్తుంటారు. తొలిసారి 2023, జనవరి 4వ తేదీన ఆ ఆశ్రమాన్ని వాళ్లు సందర్శించారు. ఆ తర్వాత ఆ దంపతులు పలుమార్లు ఆధ్యాత్మిక గురువు ఆశీస్సులు తీసుకున్నారు. కానీ ఇటీవల ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమం వివాదంలో చిక్కుకున్నది. ప్రేమానంద్ శిష్యుడు, అనుచరుడు రసిక్ దులారి అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. సెప్టెంబర్ 25వ తేదీన ఆశ్రమంలోని నాలుగవ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు విడిచాడు. రసిక్ దులారి ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతున్నారా లేదా అన్న కోణంలో మథుర పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రసిక్ దులారి మొబైల్ ఫోన్, సిమ్ కార్డు, కాల్ రికార్డు వివరాలను సేకరిస్తున్నారు. చివరి రోజుల్లో అతను ఎవరితో కాంటాక్ట్ అయ్యాడన్న కోణంలో ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రేమానంద్ శిష్యుడి మృతి కేసులో ఇప్పటికే 85 మంది నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.